తెలంగాణలో తెలుగు తమ్ముళ్లు...గులాబీ గూటికి చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లా టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావు కారెక్కిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ : తెలంగాణలో తెలుగు తమ్ముళ్లు...గులాబీ గూటికి చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లా టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావు కారెక్కిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందు వరుసలో ఉండగా...తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సైకిల్ దిగి... కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మహేశ్వరం టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న కూడా టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా తలసాని సోమవారం ఉదయం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆయన దసరా రోజు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
ఇక తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే పార్టీ మారే విషయంలో తన అనుచరులతో పాటు, నియోజకవర్గ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఆయన అనుచరులు కూడా తీగల టీఆర్ఎస్లో చేరేందకు సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. తెలంగాణలోని టీడీపీ నేతలను ...పార్టీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది.