‘ఆపద్ధర్మం’లో అడ్డదారి బదిలీలు

Teachers Transfers In Care Taking Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆపద్ధర్మ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలను తీసుకునే అధికారం లేనప్పటికీ అడ్డదారి బదిలీలకు విద్యాశాఖ తెరలేపింది. ఒకవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, మరోవైపు టీచర్ల బదిలీలపై నిషేధం ఉండగా పైరవీలకు తలొగ్గింది. నాలుగేళ్ల తర్వాత ఈ ఏడాది జూన్‌లో సాధారణ బదిలీలు జరిగాయి. దాదాపు 74 వేల మంది టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోగా 46 వేల మందికి స్థానచలనం కలిగింది. ఇందులో దాదాపు వంద మంది టీచర్లు తమ బదిలీల్లో తప్పులు దొర్లినట్లు పేర్కొంటూ విద్యాశాఖకు అప్పీళ్లు చేసుకున్నారు. వీటిని పక్షంరోజుల్లో పరిశీలించి పరిష్కరించాల్సి ఉండగా మూడు నెలలు కావస్తున్నా పట్టించుకోకపోగా దొడ్డిదారి బదిలీలకు మాత్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

నలుగురు టీచర్లకు వరుసగా బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేయడం విద్యాశాఖ వర్గాల్లో దుమారం రేపుతోంది. వీరిలో ముగ్గురు టీచర్లకు అంతర్‌ జిల్లా బదిలీలు కాగా, మరో టీచర్‌కు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో స్థానచలనం కలిగింది. ఒక టీచర్ను మాత్రం ఏకంగా జిల్లా పరిషత్‌ యాజమాన్యం నుంచి ప్రభుత్వ యాజమాన్యానికి బదిలీ చేయడం గమనార్హం. మరో 22 మంది టీచర్లకు ప్రత్యేక బదిలీలు కలిగించేందుకు విద్యాశాఖలో పైరవీలు వేగవంతమయ్యాయి.  

నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు... 

  •   వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఎల్‌.హెచ్‌.దుర్గాభవాని(స్కూల్‌ అసిస్టెంట్‌–ఇంగ్లిష్‌)ని రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్‌ 24న ప్రొసీడింగ్‌ ఇచ్చింది. దీనికి సంబంధించి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య సెప్టెంబర్‌ 11న మెమో జారీ చేశారు. 
  •   కరీంనగర్‌ జిల్లా ముగ్దూంపూర్‌ పాఠశాలలో ఎస్జీటీ పులి కవితను రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం అత్తాపూర్‌ హరిజనవాడ పాఠశాలకు బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్‌ 22న ప్రొసీడింగ్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మోమోను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదే నెల 11వ తేదీన జారీ చేశారు. 
  •   మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం బోడజానంపేట్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న వి.జీవనజ్యోతి రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలం బొమ్మనగండి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్‌ 12న ప్రొసీడింగ్‌ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మోమోను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదే నెల 11వ తేదీన జారీ చేశారు.  
  • సిద్దిపేట్‌ జిల్లా నంగునూరు మండలం రాజ్‌గోపాల్‌పేట్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పీవీ సునిత(స్కూల్‌ అసిస్టెంట్‌–ఇంగ్లిష్‌)ను హైదరాబాద్‌ జిల్లా ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ చేస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సెప్టెంబర్‌ 6న మెమో జారీ చేశారు. స్థానిక సంస్థల యాజమాన్యానికి చెందిన టీచర్‌ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలకు బదిలీ కావడం గమనార్హం.

పైరవీలకు తలొగ్గి 
ఆపద్ధర్మ ప్రభుత్వంలో జరిగిన బదిలీల వెనుక కొందరు కీలక వ్యక్తులు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. సిద్దిపేట్‌ జిల్లా నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయిన టీచర్‌ బదిలీ విషయంలో విద్యాశాఖ అధికారులపై సీఎం ఓఎస్‌డీ ఒత్తిడి చేసినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయిన టీచర్‌ విష యంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సిఫారసు ఆధారంగా బదిలీ చేస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. వికారాబాద్‌ జిల్లా నుంచి రంగారెడ్డికి బదిలీపై వచ్చిన టీచర్‌ విషయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సిఫారసు ఆధారంగా బదిలీ చేసినట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం. అంతర్జిల్లా బదిలీ విషయంలో భారీగా లావాదేవీలు జరిగినట్లు విద్యాశాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక కేటగిరీల బదిలీలు కావడంతో పెద్దమొత్తంలోనే ముడుపులు చెల్లించినట్లు ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆరోపిస్తున్నాయి. జూన్‌లో సాధారణ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చే రెండ్రోజుల ముందు కూడా ఇదే తరహాలో వంద మంది టీచర్లకు దొడ్డిదారిలో బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top