వెబ్‌ కౌన్సెలింగ్‌ వద్దే..వద్దు 

Teachers Protest Against Web Counselling In Telangana - Sakshi

ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్‌కౌన్సెలింగ్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తొలిరోజు శనివారం జరిగిన హెచ్‌ఎంల వెబ్‌కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది. ఆప్షన్లు ఇచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, ఖాళీలు కనిపించకపోవడం తదితర పరిణామాలతో ఆందోళనకు దిగారు. 
– నల్లగొండ      

నల్లగొండ : టీచర్ల బదిలీల ప్రక్రియకు సంబం ధించి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వెబ్‌ కౌన్సెలింగ్‌ రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, టీచర్లు ఆందోళనకు దిగారు. తొలిసారిగా శనివారం జరిగిన ప్రధానోపాధ్యాయుల వెబ్‌కౌన్సెలింగ్‌ గందరగోళానికి దారితీసింది. వెబ్‌కౌన్సెలింగ్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కాకపోవడంతో ఆప్షన్లు ఇచ్చుకునే క్రమంలో హెచ్‌ఎంలు అనేక రకాలు ఇబ్బందులు పడ్డారు. స్పౌజ్‌ కేటగిరీలో బదిలీ అయిన పోస్టు ఒక దగ్గర చూపిస్తే.. స్పౌజ్‌ పనిచేస్తున్న ప్రదేశం మరో దగ్గర చూపిస్తుందని హెచ్‌ఎంలు తెలిపారు. బదిలీ అయిన తర్వాత ఏర్పడిన ఖాళీ పోస్టుల వివరాలు వెబ్‌కౌన్సెలింగ్‌లో కనిపించడం లేదని దాంతో తాము కోరుకున్న ప్రదేశంలో కాకుండా మరోచోటుకు ఆప్షన్‌ వెళ్తుందని తెలిపారు.

ఆప్షన్‌ పెట్టుకున్న ప్రదేశం ఆన్‌లైన్‌లో సేవ్‌ కావడం లేదని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో శనివారం రెండొందల మందికి పైగా హెచ్‌ఎంలు వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ గందరగోళంగా మారడంతో వెబ్‌ ఆప్షన్ల సమయాన్ని పొడగించారు. సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమయాన్ని రాత్రి 12 గంటల వరకు పొడగించినట్లు అధికారులు తెలిపారు. కేవలం రెండొందల మంది హెచ్‌ఎంల కౌన్సెలింగ్‌లోనే ఇన్ని రకాల ఇబ్బందులు ఎదురైన పక్షంలో ఎస్‌జీటీలు ఉమ్మడి జిల్లాలో నాలుగు వేల మందికి పైగా ఉన్నారు. కావున ఆన్‌లైన్‌ సమస్యలు తొలగించాకే కౌన్సెలింగ్‌ నిర్వహించాలని పలువురు డిమాండ్‌ చేస్తునారు.

నాలుగో కేటగిరీ వివాదం కొలిక్కి...
కౌన్సెలింగ్‌ నాలుగో కేటగిరీ పాఠశాలల వివాదం కొలిక్కి వచ్చింది. 2015లో జరిగిన టీచర్ల కౌన్సెలింగ్‌లోనే నాలుగో కేటగిరీ పాఠశాలలను రద్దు చేశారు. 2012లో జరిగిన కౌన్సెలింగ్‌లో ఉమ్మడి జిల్లాలో నాలుగో కేటగిరీ పాఠశాలలు 466 ఉంటే...2013లో నాలుగు స్కూళ్లకు పడిపోయాయి. దీంతో 2015కు వచ్చేసరికి అసలు జిల్లాలో నాలుగో కేటగిరీ స్కూళ్లే లేకుండాపోయాయి. అయితే 2009 నుంచి 2013 వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొనకుండా లాంగ్‌స్టాండింగ్‌లో పనిచేసిన టీచర్లకు ఈ కౌన్సెలింగ్‌లో అదనపు పాయింట్లు కల్పించాలని టీచర్లు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా విధానం అన్ని జిల్లాలో కల్పించినప్పటికీ నల్లగొండ జిల్లాలో మాత్రమే నాలుగో కేటగిరీకి కౌన్సెలింగ్‌లో స్థానం కల్పించలేదు. దీంతో శనివారం టీచర్లు విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌ను కలిశారు. విద్యాశాఖ జేడీ, డీఈఓలతో సమావేశమైన కలెక్టర్‌ నాలుగో కేటగిరీ అంశాన్ని పరిశీలించారు.

2012 వరకు వందల సంఖ్యలో ఉన్న నాలుగో కేటగిరీ స్కూళ్లు 2013లో అనూహ్యంగా పడి పోవడాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. నల్లగొండ జిల్లాలో రవాణా సౌకర్యం ఉన్నటువంటి కుక్కడం, కొత్తపల్లి వంటి స్కూళ్లను నాలుగో కేటగిరీలో చేర్చడంపైన కలెక్టర్‌ ఆరా తీశారు. 2009 నుంచి 2013 వరకు నాలుగో కేటగిరీలో ఉన్న స్కూళ్ల జాబితాను పరిశీలించి అర్హత కలిగిన స్కూళ్ల జాబితాను పంపించేందుకు మండల స్థాయిలో కమిటీ వేశారు. ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓలు ఆ స్కూళ్ల జాబితాను పరిశీలించి వెంటనే డీఈఓ కార్యాలయానికి పంపాలని సూచించారు. మండలాల నుంచి వచ్చే నాలుగో కేటగిరీ స్కూళ్ల జాబితాను డైరక్టరేట్‌కు పంపించి అక్కడి నుంచి అనుమతి పొందాక మళ్లీ సీనియారిటీ జాబితాలో మార్పులు చేయడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top