జిల్లాలో మొత్తం 6,500 చెరువులున్నాయి.
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో మొత్తం 6,500 చెరువులున్నాయి. వాటిలో పెద్ద చెరువులు (వందెకరాల విస్తీర్ణంలో ఉన్నవి) 681. వీటికింద 1,56,334 ఎకరాలు సాగవుతోంది. ఇక చిన్న చెరువులు 5,819. వీటికింద 82,722 ఎకరాల పంట సాగవుతోంది. అయితే ఈ చెరువుల్లో 30 ఏళ్లుగా ఒండ్రుమట్టి పేరుకుపోయింది. వీటికి వరద వచ్చే కాల్వలు కూడా మట్టితో నిండుకున్నాయి. దీంతో చెరువులు కింద ఆయకట్టు అంతంత మాత్రంగానే సాగువుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెరువులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. తద్వారా మొదటి విడతలో 20శాతం చెరువులు బాగుచేయాలని భావించింది. అందుకోసం ఆయా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లోని చెరువులను మొదటి ప్రాధాన్యతగా వేటిని చేపట్టాలో సూచించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు కూడా వారి ప్రాధాన్యం గల చెరువుల చిట్టాను అధికారులకు అందజేశారు.
డివిజన్ల వారీగా..
మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలోకి మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, కల్వకుర్తి, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ని యోజకవర్గాలు, దేవరకద్ర నియోజకవర్గం లోని సగభాగం, నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని తాడూరు, తిమ్మాజిపేట మండలాలు వస్తాయి. వీటికి సంబంధిం చి ఎమ్మెల్యేల నుంచి చిన్నాపెద్దా అనే తేడాలేకుండా 713 చెరువుల ప్రతిపాదనలు వచ్చాయి.
నాగర్‌కర్నూల్ డివిజన్ కిందికి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చం పేట నియోజకవర్గాలు వస్తాయి. ఈ డివిజన్‌లో ఎమ్మెల్యేల నుంచి మొత్తం 576 చెరువుల ప్రతిపాదనలు వచ్చాయి.
అలాగే వనపర్తి డివిజన్ పరిధిలో కి వనపర్తి, అలంపూర్, గద్వాల, దేవరకద్ర నియోజకవర్గంలోని సగభాగం వస్తోంది. దీని పరిధిలో ఎమ్మెల్యేల నుంచి 280 చెరువుల పు నరుద్ధరణ కోసం ప్రతిపాదనలు వచ్చాయి. ఇలా జిల్లావ్యాపంగా మొత్తం 1569 చిన్నాపెద్ద చెరువుల పునరుద్ధరణ కోసం ప్రతిపాదనలు అందాయి.
నిండని చెరువులు
ఈ ఏడాది వర్షాలు అంతంత మా త్రంగానే కురవడంతో జిల్లాలోని చెరువులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలో కాస్త మెరుగ్గానే వర్షాలు కురిశాయి. ఈ డివిజన్‌లో 318 పెద్దవి, 2,646 చిన్న చెరువులున్నాయి. వీటిలో చిన్నాపెద్దా కలిపి మొత్తం 334 నిండాయి. 46 చెరువుల నిర్వహణ సరిగా లేకపోవడంతో గండ్లు పడ్డాయి. ఇక వనపర్తి డివిజన్‌లో 152 పెద్దవి, 1,069 చిన్నవి ఉన్నాయి. వీటిలో కేవలం 32 చెరువులు మాత్రమే నిండాయి. నాగర్‌కర్నూల్ డివిజన్‌లో 223 పెద్దవి, 2,104 చిన్న చెరువులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క చెరువూ పూర్తిస్థాయిలో నిండకపోగా.. ఐదు చెరువులకు గండ్లు పడి ఉన్న నీరంతా వెళ్లిపోయింది. చెరువులను అభివృద్ధి చేయడం పట్ల రైతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.