స్వేచ్ఛాయుత ఓటింగ్‌కు చర్యలు

Taking Actions To Freedom Voting - Sakshi

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

నియోజకవర్గంలో 256 పోలింగ్‌ కేంద్రాలు

సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు

కాగజ్‌నగర్‌: సిర్పూర్‌ నియోజకవర్గంలో నిర్వహించే శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని 256 పోలింగ్‌ కేంద్రాల వద్ద ర్యాంపులు, సౌకర్యాలు కల్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలోని సమస్యాత్మక, అతి సమస్యత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించ డం, పోలింగ్‌ స్టేషన్‌ల్లో వెబ్‌ కాస్టింగ్‌ చేయానికి చర్యలు తీసుకుంటున్నారు. కాగజ్‌నగర్‌ మండలంలోని భట్టుపల్లిలో పింక్‌ పోలింగ్‌ కేంద్రంగా ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రంలో అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు అందరూ మహిళలే ఉంటారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఎన్నికలు సజావుగా నిర్వహించేలా ఎన్నికల అధికారులు చురుగ్గా చర్యలు చేపడుతున్నారు.
 
సమస్యాత్మక కేంద్రాలు.. సమస్యల కేంద్రాలు
సిర్పూర్‌ నియోజకవర్గంలోని 40 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించగా, బెజ్జూర్‌ మండలంలోని మర్తిడి గ్రామంలో రెండు అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. పెంచికలపేట్‌ మండలంలోని మోర్లి గూడ గ్రామంతోపాటు గొండి, రేగులగూడ, మారేపల్లి, మెట్‌పల్లి, కోసిని, కమ్మర్‌గాం, అంబగట్టు, అచ్చేల్లి, చింతకుంట, గిరివెళ్లి, మొట్లగూడ తది తర గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదని అధి కారులు గుర్తించారు. మొర్లిగూడ గ్రామానికి కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉంది. పలు గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గుట్టలు ఎక్కిదిగాల్సి వస్తుంది. నిధుల మంజూరు కోసం సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. 

నియోజకవర్గ ఓటర్లు..
నియోజకవర్గంలోని 146 గ్రామ పంచాయతీలు ఉండగా 256 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నూతన ఓటరు జాబితా వివరాల ప్రకారం నియోజకవర్గంలో మొత్తం 187387 ఓటర్లు నమోదు చేసుకున్నారు. అందులో పురుషులు 94786, మహిళలు 92570, ఇతరులు 31 మంది ఉన్నారు. ఇందులో 3243 మంది దివ్యాంగులు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మంచిర్యాల జిల్లాలోని భీమిని మండలంలోని కేస్లాపూర్, గుడిపేట, చిన్నతిమ్మాపూర్, పెద్ద తిమ్మాపూర్, కన్నెపల్లి మండలాల్లోని సాలిగాం, ఐతపూర్‌ గ్రామాల్లో 6 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగకపోవడంతో పాత నియోజకవర్గంలోనే ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 

నియోజకవర్గంలో అత్యల్పంగా 152 ఓటర్లు ఉన్న కేంద్రం చిత్తమా (చింతలమానేపల్లి మండలం) కాగా, అత్యధికంగా 1384 ఓటర్లు ఉన్న కేంద్రం కాగజ్‌నగర్‌ పట్టణంలోని బాలభారతి పోలింగ్‌ కేంద్రం నిలిచింది. పట్టణంలోని బాలవిద్యమందిర్‌ కేంద్రంలో అత్యధిక 731 మంది మహిల ఓటర్లు, చింతలమానేపల్లి మండలంలోని చిత్తామాలో అత్యల్ప 75 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. పట్టణంలోని ఓల్డ్‌ హైస్కూల్‌లో అత్యధిక 669 మంది పురుష ఓటర్లు ఉండగా, చిత్తామాలో 175 మంది అత్యల్పంగా పురుష ఓటర్లుగా నమోదయ్యారు. 

వెబ్‌ కాస్టింగ్‌కు చర్యలు..
కాగజ్‌నగర్‌ పట్టణంలో 44 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా,  వివిధ మాండలాల్లో 212 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. 3జీ, 4జీ ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో పోలింగ్‌  కేంద్రాలను వెబ్‌ కాస్టింగ్‌ కోసం ఎంపిక చేశారు.  98 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించడానికి చర్యలు చేపట్టారు. ఎన్నికల నిర్వహణ కోసం 1129 మంది సిబ్బందిని నియమించారు. 

పోలింగ్‌ కేంద్రాల వివరాలు..
నియోజకవర్గంలో మొత్తం 256 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో 44, గ్రామాల్లో 47, సిర్పూర్‌ మండలంలో 29, కౌటాల మండలంలో 29, చింతలమానేపల్లి మండలంలో 29, బెజ్జూర్‌ మండలంలో 25, పెంచికలపేట్‌ మండలంలో 16, దహెగాం మండలంలో 31, భీమిని మండలంలో 4, కన్నెపల్లి మండలంలో 2 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాలను 29 రూట్లుగా విభజించారు. ఇందులో 30 బస్సు, 16 మినీ బస్సులు, 16 టాటా ఏసీ వాహనాలు, 2 బులేరో, 2 ట్రాక్టర్లు ఏర్పాటు చేయనున్నారు. 

సిర్పూర్‌ నియోజకవర్గం పకడ్బందీ నిర్వహణ...
సిర్పూర్‌ నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికలు నిర్వహణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. సమస్యాత్మక కేంద్రాలతోపాటు అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాం. కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. నియోజకవర్గంలో 6 రోడ్లు నిర్మించడానికి పంచాయతీరాజ్‌ శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఓటింగ్‌రోజు 98 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించడానికి సిబ్బందిని నియమించే ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద మంచినీటి, మరుగుదొడ్లు, వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునే చర్యలు చేపడుతున్నాం.

-జి.శివకుమార్, ఎన్నికల నిర్వహణ అధికారి, (కాగజ్‌నగర్‌ ఆర్డీవో)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top