తమిళనాడు తరహాలో చర్యలు | Sakshi
Sakshi News home page

తమిళనాడు తరహాలో చర్యలు

Published Wed, Feb 10 2016 4:06 AM

తమిళనాడు తరహాలో చర్యలు - Sakshi

అక్రమ నిర్మాణాలను రిజిస్టర్ చేయకుండా అక్కడ చట్టం ఉంది
ట్రిబ్యునల్ ఏర్పాటునూ పరిశీలిస్తున్నాం
అక్రమ నిర్మాణాలను అణచివేస్తాం
హైకోర్టుకు నివేదించిన తెలంగాణ సర్కారు

సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు తమిళనాడు తరహాలో చర్యలు తీసుకునే విషయంపై అధ్యయనం చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. అక్రమ నిర్మాణాలను రిజిస్టర్ చేయకుండా తమిళనాడులో చట్టం ఉందని, దానిని ఇక్కడ అమలు చేసేందుకు అవసరమైన చట్ట సవరణను తెచ్చే విషయాన్ని ఆలోచిస్తున్నామని తెలిపింది. అలాగే అక్రమ నిర్మాణాల విషయంలో దాఖలయ్యే కేసులను విచారించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే విషయాన్నీ పరిశీలిస్తున్నామంది.

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను అణచివేసేందుకు చర్యలు ప్రారంభించామని, నిబంధనలకు విరుద్ధంగా చేసిన నిర్మాణాలను కూల్చివేస్తున్నామని పేర్కొంది. తమ పొరుగువారు సెట్‌బ్యాక్‌లు విడిచిపెట్టకుండా అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని, దీనిపై ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో చర్యలు తీసుకునేలా జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన జాన్ మహమ్మద్ అలియాస్ షాహాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి అక్రమ నిర్మాణాలను మొగ్గలోనే తుంచి వేసేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈమేరకు మంగళవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.జి.గోపాల్ కౌంటర్ దాఖలు చేశారు. అక్రమ నిర్మాణాలను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ గతంలోనే చట్ట సవరణ తెచ్చామని, దాని కింద ఇప్పటికే 31 కేసులు కూడా నమోదు చేశామన్నారు.

అక్రమ లేఔట్లలో జరిగిన నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్మాణాలను రిజిస్టర్ చేయకుండా తమిళనాడులో చట్టం ఉందని, ఆ చట్టాన్ని ఇక్కడ అమలు చేసే విషయమై అధ్యయనం చేస్తున్నామన్నారు. అలాగే పురపాలకశాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని గోపాల్ వివరించారు. ఉన్నతస్థాయి పోస్టుల భర్తీ ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. అక్రమ నిర్మాణాలపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, తగిన విధంగా స్పందించేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులతో టీమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.

Advertisement
Advertisement