ఆ కాలేజీలను మూసేస్తాం

Syed Umar Jalil Says That We Will Close Those Colleges - Sakshi

ఫైర్‌ సేఫ్టీ నిబంధనలను పాటించని భవనాల్లో కాలేజీలను కొనసాగించేది లేదు 

ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలను పాటించని భవనాల్లో కొనసాగుతున్న జూనియర్‌ కాలేజీలను మూసేస్తామని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. 2020–21 విద్యా సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా భవనాల్లో ఆ కాలేజీలను కొనసాగించేది లేదని స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో సోమవారం తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఇప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. పరీక్షలు పూర్తయ్యాక ఆయా భవనాల్లో కాలేజీలను కొనసాగించకుండా చూస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రథమ సంవత్సరం పూర్తయ్యే విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి పంపించాలని తెలిపారు.

ఆయా కాలేజీలు నిబంధనలు పాటించని వైనంపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, వారు చెప్పిన సమాధానం పట్ల బోర్డు సంతృప్తి చెందలేద న్నారు. అందుకే త్వరలోనే మూసివేత నోటీసులు ఇస్తామని తెలిపారు. మరోవైపు కావాలనుకుంటే ఆయా యాజమాన్యాలు ఆ కాలేజీలను ఇతర భవనాల్లోకి షిప్ట్‌ చేసుకోవచ్చని సూచించారు. అందుకోసం అఫిలియేషన్‌ దరఖాస్తుల సమయంలో కొత్త భవనాలకు సంబంధించి షిఫ్టింగ్‌ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించని యాజమాన్యాల్లో శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన 18 కాలేజీలు, నారాయణ విద్యా సంస్థలకు చెందిన 26 కాలేజీలు, శ్రీ గాయత్రి విద్యా సంస్థలకు చెందిన 8 కాలేజీలు, ఎన్‌ఆర్‌ఐ విద్యా సంస్థలకు చెందిన 5 కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు 11 ఉన్నట్లు వెల్లడించారు.

కాలేజీలు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కాలేజీ హాస్టళ్లను నియంత్రించేందుకు చర్యలు చేపడతామన్నారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలో జారీ చేస్తామ ని చెప్పారు. ఒత్తిడిని అధిగమించేలా, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునేలా విద్యార్థులకు హార్ట్‌ఫుల్‌నెస్‌ సొసైటీ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. దీనిపై త్వరలోనే ఆ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నట్లు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top