పల్లె బతుకు మారుతోందా?

Survey About Rural Areas Development By Central Government - Sakshi

గ్రామాల్లో ప్రజల స్థితిగతులపై ఆరా తీయనున్న కేంద్రం

సామాజిక, ఆర్థిక కుల గణన పేరిట16 అంశాలపై ఇంటింటి సర్వే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామీణుల జీవన ప్రమాణాలపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీయనుంది. పదేళ్లలో మారిన ప్రజల స్థితిగతుల గురించి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టనుంది. సామాజిక, ఆర్థిక, కుల గణన (ఎస్‌ఈసీసీ) పేరిట ఇంటింటి సర్వే నిర్వహించనుంది. ప్రజలకు అందుతున్న కనీస సేవలు, ప్రభుత్వ పథకాల అమలు, ఇతరత్రా సామాజిక అంశాలపై సమగ్ర సమాచారం సేకరించనుంది. ఈ మేరకు గ్రామాలవారీగా వివరాలు సేకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ సహకారంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 14 కల్లా ఈ వివరాలను సేకరించాలని నిర్ణ యించింది. ఇందుకోసం 16 ప్రామాణికాలను నిర్దేశించిన ప్రభుత్వం.. ఆ మేరకు సమా చారాన్ని నమోదు చేయాలని ఆదేశించింది. వంటగ్యాస్‌ కనెక్షన్, విద్యుత్‌ కనెక్షన్, బ్యాంకు ఖాతా, జీవిత బీమా ఉందా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకోనుంది. గర్భిణులు, 0–6 ఏళ్లలోపు చిన్నారుల సమాచారం, టీకాల వివరాలు, పౌష్టికాహార లభ్యతకు సంబంధించిన డేటా నమోదు చేయనుంది. ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయా? ప్రాథమిక పాఠశాల సౌకర్యముందా? కుటుంబ సభ్యులు డ్వాక్రా గ్రూపులో సభ్యులుగా ఉన్నారా? పక్కా ఇళ్లు ఉన్నాయా? అనే అంశాలపై సర్వే నిర్వహించనుంది. సామాజిక పింఛన్‌ అందుతోందా? ఆయుష్మాన్‌ భారత్‌ కింద హెల్త్‌ కార్డు ఉందా? అనే వివరాలు సేకరించనుంది.

వివరాల సేకరణకు ప్రత్యేక యాప్‌.. 
ప్రజల వివరాలను నమోదు చేసేందుకు కేంద్రం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. గ్రామీణ ప్రజల సమాచారాన్ని నమోదు చేసేందు కు వెళ్లే ఎన్యూమరేటర్లకు యాప్‌తో కూడిన మొబైల్‌ను అందించనుంది. పదేళ్లకోసారి జనగణన నిర్వహించే కేంద్రం.. అదే సమయంలో దశాబ్ద కాలంలో ప్రజల జీవన ప్రమాణాలు ఏ మేరకు మెరుగయ్యాయి? ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల దరికి చేరుతున్నాయా? అనేది అంచనా వేసేందుకు సామాజిక, ఆర్థిక, కుల గణన నిర్వహిస్తోంది. ఈ డేటా ప్రాతిపదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. పథకాల అమలు తీరును సమీ క్షించి కొత్త వాటికి రూపకల్పన చేస్తాయి. ఈసారి సర్వేలో ఇంటి యజ మాని మొబైల్‌ నంబర్‌ను కూడా ప్రభుత్వం తీసుకుంటోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top