సిటీ హీట్‌

Summer Effect Power Use Rising in Hyderabad - Sakshi

మండుతున్న ఎండలు  

శుక్రవారం 3,102 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం  

డిస్కం చరిత్రలో ఇదే అత్యధికం  

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎండలు మండుతున్నాయి. తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. మరిన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, నగరవాసులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. నగరంలో శుక్రవారం 42డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా.. అత్యధికంగా శివారులోని శామీర్‌పేట, కీసరలలో 43.9, ఘట్కేసర్‌లో 43.4, మేడ్చల్‌లో 43.3 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక సిటీ పరిధిలో అత్యధికంగా బహదూర్‌పురాలో 42.8, సైదాబాద్‌లో 42.3, బండ్లగూడలో 42.2, ఖైరతాబాద్‌లో 42.1, ముషీరాబాద్‌లో 41.9, అమీర్‌పేట్‌లో 41.8, సరూర్‌నగర్‌లో 41.7, హిమాయత్‌నగర్‌లో 41.4, ఉప్పల్‌లో 41.4, శేరిలింగంపల్లిలో 41.3 డిగ్రీలు నమోదయ్యాయి.

వాస్తవానికి ఈ సీజన్‌లో సగటు ఉష్ణోగ్రత 39 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా... సాధారణం కంటే 3–4 డిగ్రీలు అధికంగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో 2010 మే 12న 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా... 2018 మే 2న 42.5, 2017 మే 25న 43.2, 2016 మే 1న 42.1 డిగ్రీలు నమోదైంది. ఈ ఏడాది ఇప్పటికే 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలా ఉండగా నగరంలో శుక్రవారం రికార్డు స్థాయిలో 3,102 మెగావాట్ల విద్యుత్‌ వినియోగమైంది. డిస్కం చరిత్రలో  ఇదే అత్యధికం. 2018 మే 30న 2,958 మెగావాట్ల విద్యుత్‌ వినియోగించారు. అధిక విద్యుత్‌ వినియోగంతో పలు ఫీడర్లు ట్రిప్‌ అవుతున్నా.. 5–10 నిమిషాల్లో సరఫరా పునరుద్ధరిస్తున్నామని డిస్కం అధికారులు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top