దుమ్ముగూడెం..పోలవరం టు సాగర్, శ్రీశైలం 

A study of water moving elements - Sakshi

నీటిని తరలించే అంశాలపై అధ్యయనం 

ఈఎన్‌సీ నేతృత్వంలో ఇంజనీర్లతో కమిటీ 

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు తరలించే ప్రతిపాదనల తయారీ ప్రక్రియకు తెలంగాణ నీటి పారుదలశాఖ ఇంజనీర్లు పదునుపెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సూచనల మేరకు ఏయే ప్రాంతాల నుంచి గోదావరి నీటిని కృష్ణాలోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించాలన్న అంశాలపై ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దుమ్ముగూడెం, పోలవరంల నుంచి నీటిని ఈ రెండు ప్రాజెక్టులకు తరలించే అంశాలపై అధ్యయనం చేయాలని  ఇంజనీర్లు నిర్ణయించినట్లుగా తెలిసింది. 

తెరపైకి అయిదురకాల ప్రతిపాదనలు.. 
ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగానే ఐదు రకాల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఇందులో దుమ్ముగూడెం నుంచి సాగర్‌కు నీటిని తరలించడం ఒకటి కాగా, మరొకటి పోలవరం నుంచి పులిచింతల, సాగర్‌ల మీదుగా శ్రీశైలానికి తరలించడం ప్రధానంగా ఉన్నాయి. ఇందులో ఇప్పటికే దుమ్ముగూడెం నుంచి సాగర్‌కు తరలించేలా ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదనలు చేశారు. దు మ్ముగూడెం ప్రాంతం నుంచి 165 టీఎంసీల నీటిని తీసుకుంటూ ఖమ్మం జిల్లా బయ్యారం నుంచి నాగార్జునసాగర్‌ దిగువన నల్లగొండ జిల్లాలోని హాలియా సమీపంలో ఉన్న టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టులోకి నీటిని తరలించేలా ప్రతిపాదన ఉంది. దీని కోసం 244 కిలోమీటర్ల పొడవున లింక్‌కెనాల్‌ తవ్వడంతో పాటు, 6 లిఫ్టు వ్యవస్థల నిర్మాణం చేయాల్సి ఉంది.

ఈ నీటిని టెయిల్‌పాండ్‌కు తరలించాక సాగర్‌ డ్యామ్‌లోని హైడ్రో ఎలక్ట్రికల్‌ పవర్‌ స్టేషన్‌లోని 7 రివర్సబుల్‌ టర్బైన్‌ల ద్వారా నీటిని సాగర్‌ రిజర్వాయర్‌లోకి తరలించవచ్చని అప్పట్లో నిర్ధారించారు.లింక్‌కెనాల్‌ తవ్వకంతో ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలో 3,701 ఎకరాల అటవీభూమి, 16,084 ఎకరా ల ప్రైవేటు భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ప్రస్తుతం ముంపు ప్రాంతాన్ని తగ్గించి, కనిష్టంగా 200 టీఎంసీల నీటిని, ఇరు రాష్ట్రాల్లోని కరువు జిల్లాల్లో గరిష్ట ఆయకట్టుకు తరలించే ప్రతిపాదనలపై ఇంజనీర్లు దృష్టి సారించారు. ఇక పోలవరం నుంచి వైకుంఠాపురం బ్యా రేజీ మీదుగా పులిచింతలకు, అటునుంచి సాగర్, అక్కడి నుంచి శ్రీశైలానికి తరలించే ప్రతిపాదనపైనా క్షుణ్నం గా అధ్యయనం చేయాలని ఇంజనీర్లు నిర్ణయించారు. నదీగర్భం ద్వారానే నీటిని తరలించే ఈ విధానంతోనే తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలోనే ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని తెలంగాణ ఇంజనీర్లు చెబుతున్నారు. 

ఈఎన్‌సీ నేతృత్వంలో కమిటీ.. 
ఇక గోదావరి నుంచి శ్రీశైలానికి నీటిని తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పది మంది ఇంజనీర్లతో కమిటీని నియమించింది. ఈఎన్‌సీ మురళీధర్‌ నేతృత్వంలోని ఈ కమిటీలో అంతర్రాష్ట్ర జల విభాగపు సీఈ ఎస్‌.నరసింహరావు, సాగర్‌ సీఈ నర్సింహా, సీతారామ ఎస్‌ఈ టి.నాగేశ్వర్‌రావు, అంతర్రాష్ట్ర విభాగపు ఎస్‌ఈ మోహన్‌కుమార్‌లతో పాటు రిటైర్డ్‌ ఇంజనీర్లు వెంకటరామారావు, చంద్రమౌళి, సత్తిరెడ్డి, శ్యాంప్రసాద్‌ రెడ్డి, భవానీరామ్‌ శంకర్‌లు ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top