'డబుల్‌' స్పీడ్‌

Speed up in the works of Double bedroom housing scheme - Sakshi

పనులు వేగిరం చేసిన గృహనిర్మాణ శాఖ

పూర్తయిన ఇళ్లు 19,195, తుదిదశలో ఉన్నవి 30వేలు

పార్లమెంటు ఎన్నికల్లోగా 80 వేలు లక్ష్యం

వేగంగా విద్యుత్తు, డ్రైనేజీ,రోడ్ల కనెక్టివిటీ

రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకుంది.ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సీఎం ఆదేశాలతో ఈ ఇళ్ల నిర్మాణాలు తిరిగి ఊపందుకున్నాయి. సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు కేవలం 4 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసిన తెలంగాణ గృహనిర్మాణశాఖ ఒక్క జనవరిలోనే 1,639 నిర్మాణాలను పూర్తి చేయడమే ఇందుకు నిదర్శనం. పార్లమెంటు ఎన్నికలనాటికి దాదాపుగా 80 వేల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాల్లో తుదిదశకు వచ్చిన నిర్మాణాలు సుమారు 30వేల వరకు ఉన్నాయని వివరించారు. 

వేగంగా మౌలిక సదుపాయాల కల్పన.. 
ఓవైపు ఇళ్లను వేగంగా పూర్తి చేస్తూనే.. మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనపైనా అధికారులు అదే స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. పూర్తయిన గృహ సముదాయాలకు విద్యుత్తు, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను వేగంగా కల్పిస్తున్నారు. ఇందుకోసం ఆయా శాఖలతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఫలితంగా పలు సముదాయాల వద్ద ఇప్పటికే రోడ్లు, విద్యుత్‌ కనెక్షన్‌ పనులు వేగంగా నడుస్తున్నాయి.
పోటెత్తుతున్న దరఖాస్తులు 
2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధాన హామీల్లో ఇది కూడా ఒకటి. దీంతో దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబుల్‌పై పేదలకు ఆశలు పెరిగాయి. అందుకే ఒక్క హైదరాబాద్‌ పరిధిలోనే దాదాపు 3 లక్షల దరఖాస్తులు రావడమే స్పందనకు నిదర్శనం. మిగిలిన జిల్లాల్లో దాదాపుగా మరో ఆరు లక్షల దరఖాస్తులు వచ్చాయని సమాచారం. 

నాలుగు జిల్లాల్లో ఊసే లేదు.. 
జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, కుమ్రంభీం, వికారాబాద్‌ జిల్లాల్లో గడిచిన నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. ఈ జిల్లాలకు పార్లమెంటు ఎన్నికల్లోపు ఇళ్ల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. 

ఇళ్ల పంపిణీ ఎప్పుడో...
వాస్తవానికి లక్షకుపైగా ఇళ్లను పార్లమెంటు ఎన్నికలలోపు పూర్తి చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ, దీనిపై సీఎం కేసీఆర్‌ ఇటీవల స్పష్టత ఇచ్చారు. ఆదరాబాదరాగా తాము ఇళ్లను పూర్తి చేయాలనుకోవడం లేదని, ప్రజలు మాపై నమ్మకాన్ని ఉంచి రెండోసారి గెలిపించిన నేపథ్యంలో నాణ్యమైన ఇళ్లనే ఇవ్వాలనుకుంటున్నామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇళ్ల పంపిణీ ఎప్పుడన్నది ఆసక్తిగా మారింది. 
– సాక్షి, హైదరాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top