అమావాస్య ..  అన్నదానం

Special Story About Started Food Supply From Amavasya Day On 31st October 1995 - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ : మానవులుగా మనకు ఎవరు ఏమి ఇచ్చినా సరే మళ్లీ కావాలంటాం.. కానీ కడుపునిండా అన్నం పెడితే మాత్రం ఏమి కావాలని అడగరని నిరూపిస్తున్నారు ‘వికాస తరంగిణి’ నిర్వాహకులు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి వారి తిరునక్షత్రోత్సవం(జన్మదినోత్సవం)ను పురస్కరించుకుని 1995 అక్టోబర్‌ 31వ తేదీ దీపావళి అమావాస్య నుంచి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. వికాస తరంగిణి మహబూబాబాద్‌ శాఖ ఆధ్వర్యంలో పేదలకు ప్రతినెలా అమావాస్య రోజున కడుపునిండా అన్నం పెడుతున్నారు.

ఇప్పటి వరకు 22 ఏళ్లుగా, 270 నెలల నుంచి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది.  హిందూ సంప్రదాయం ప్రకారం ధార్మికంలో అమావాస్య రోజున అన్నదానం చేస్తే ఎంతో పుణ్యఫలమని, జీయర్‌స్వామి వారి తిరునక్షత్రోత్సవం మంచిరోజని అన్నదానం చేస్తూ వస్తున్నారు. అన్నదానం రోజున 300 నుంచి 350 మంది వరకు భక్తులకు తృప్తికరంగా జిల్లా కేంద్రంలోని శ్రీరామ మందిరంలో అన్నదానం చేస్తున్నారు. కొంత కాలంగా ఈ కార్యక్రమాన్ని శ్రీరామ మందిరం నుంచి మార్వాడీ సత్రానికి మార్చారు. కాగా, శ్రీభక్తమార్కండేయ శివాలయం, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో కూడా ప్రతినెల అన్నదానం చేస్తున్నారు. అన్నదానం అంటే ఏదో ఓ రకం కాకుండా అన్నం, పప్పుకూర, స్వీట్‌ రైస్, పులిహోర, సాంబారుతో అన్నం పెడుతుండడం విశేషం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top