సహకార ఎన్నికలకు  సర్కారు బ్రేక్‌ 

Society Elections Will Be Stopped Until Next GO Released - Sakshi

17న విడుదల చేయాల్సిన నోటిఫికేషన్‌ నిలుపుదల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సహకార ఎన్నికలకు మరోసారి బ్రేక్‌ పడింది. రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎటువంటి నోటిఫికేషన్‌ ఇవ్వకూడదని సహకార శాఖకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థ సారథి స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలు ముగియగానే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్‌)కు ఎన్నికలు నిర్వహించాలని ముందుగా భావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఆ దిశగా అధికా రులకు సంకేతాలు ఇచ్చారు. అందులో భాగంగా ఫిబ్రవరి రెండో వారంలో ప్యాక్స్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 17న నోటిఫికేషన్‌ ఇవ్వాలని సహకార శాఖ అధికారులు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ శాఖ కమిషనర్‌ ఎం.వీరబ్రహ్మయ్య ఇటీవల ‘సాక్షి’కి తెలిపారు. ఎన్నికల కోసం ప్యాక్స్‌ ఓటర్ల తుది జాబితాను కూడా రూపొందించుకున్నారు.

ఫిబ్రవరి రెండో వారంలో ప్యాక్స్‌లకు ఎన్నికలు ముగియగానే అదే నెల 25వ తేదీ కల్లా డీసీసీబీ, డీసీఎంఎస్, టెస్కాబ్‌ల ఎన్నిక పూర్తి చేయాలని షెడ్యూల్‌తోపాటు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీ సీట్లు ఆశించి భంగపడే వారికి డీసీసీబీ చైర్మన్‌గా నియమించాలని అధికార పార్టీ భావిస్తోంది. అలాగే ఎంపీ ఎన్నికలకు క్షేత్రస్థాయిలో ప్యాక్స్, డీసీసీబీ ఆశావహులను ఇప్పుడు బలంగా పనిచేయించుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనతో తాత్కాలికంగా ప్యాక్స్‌ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ప్రస్తుతం 906 ప్యాక్స్‌లకు పర్సన్‌ ఇన్‌చార్జిలు కొనసాగుతున్నారు. ఈ గడువు వచ్చే నెల మొదటి వారంలో ముగుస్తుంది. అప్పటికీ ఎన్నికలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే వారినే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top