గ్రేటర్ దాహార్తిని తీరుస్తోన్న సింగూర్ జలాలు విషతుల్యమవుతున్నాయి. జలాశయం నీటిలో పారిశ్రామిక వ్యర్థ రసాయనాలు కలవడం వల్ల కెమికల్ ఆక్సిజన్ డిమాండ్(సీఓడీ ) బాగా పెరిగినట్టు తేలింది.
- ప్రాజెక్ట్ జలాల్లో రసాయనాల ఆనవాళ్లు
- సిటీకి రోజూ 77 మిలియన్ గ్యాలన్ల సరఫరా..
- నీటి నాణ్యతపై సర్వత్రా ఆందోళన
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ దాహార్తిని తీరుస్తోన్న సింగూర్ జలాలు విషతుల్యమవుతున్నాయి. జలాశయం నీటిలో పారిశ్రామిక వ్యర్థ రసాయనాలు కలవడం వల్ల కెమికల్ ఆక్సిజన్ డిమాండ్(సీఓడీ ) బాగా పెరిగినట్టు తేలింది. సాధారణంగా సీఓడీ నీటిలో ఉండరాదని, అయితే, పరిస్థితి ఇప్పటికే చేయిదాటిందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఇక ఈ జలాశయం నీటిలో బీఓడీ (బయులాజికల్ ఆక్సిజన్ డివూండ్) సైతం పడిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
ఆందోళన కలిగిస్తున్న సీఓడీ స్థాయిలు...
మహానగరానికి నిత్యం సింగూర్ ఫేజ్-3 ద్వారా 35 మిలియన్ గ్యాలన్లు, ఫేజ్-4 ద్వారా 42 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. నగరానికి రోజూ వస్తున్న మొత్తం 77 మిలియన్ గ్యాలన్ల సింగూర్ జలాలను సింగాపూర్, లింగంపల్లి, ఖానాపూర్ రిజర్వాయర్లలో నిల్వ చేసి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఆసిఫ్‌నగర్, రెడ్‌హిల్స్, మెహిదీపట్నం, శేరిలింగంపల్లి పరిధిలోని వందలాది కాలనీలు, బస్తీలకు జలమండలి సరఫరా చేస్తోంది.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. సింగూర్ జలాశయం (మెదక్‌జిల్లా) సమీపంలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు, వ్యవసాయ పనుల్లో వినియోగించే పురుగుమందులు తదితర అవశేషాలు చిన్నపాటి వర్షం వస్తే చాలు ఈ జలాశయం నీటిలో చేరుతున్నట్లు ఐపీఎం నివేదికలో తేలింది. ఐపీఎంకు చెందిన నీటి నాణ్యత నిపుణులు సింగూర్ జలాలపై ఇటీవల పరిశోధన జరిపారు.
ఈ పరిశోధనలో ప్రతి లీటరు సింగూర్ జలాల్లో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ) స్థాయి ఫేజ్-3 జలాల్లో 44.8 మిల్లీగ్రాములు, ఫేజ్-4 సింగూర్ జలాల్లో 57.6 మిల్లీ గ్రాములుగా ఉన్నట్లు తేలింది. ఈ ప్రాజెక్టు నీటిని జలమండలి ద్రవరూప క్లోరిన్‌తో రిజర్వాయర్ల వద్ద అరకొరగా శుద్ధి చేస్తున్నప్పటికీ అందులో సీఓడీ స్థాయిలు తగ్గడంలేదని తేల్చారు. ఇక నీటిలో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ప్రతి లీటరు నీటిలో 4 మిల్లీగ్రాములుగా ఉండాలి. కానీ ఫేజ్-3 జలాల్లో 3.8 మిల్లీగ్రాములు,ఫేజ్-4 సింగూర్ జలాల్లో 4.3 మిలీ ్లగ్రాములుగా ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.
సీఓడీ అధికంగా ఉన్న నీటితో కలిగే దుష్ఫలితాలివే...
ఈ నీటిని తాగిన వారికి దీర్ఘకాలంలో నిమోనియా, టైఫాయిడ్, కామెర్లు, విరేచనాలు, కోరింత దగ్గు, జలుబు వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది
సీఓడీలో భాగమైన ఫినాయిల్, క్లోరో ఫినాయిల్, పారాఫిన్ హైడ్రోకార్బన్ల వల్ల తాగునీటి రుచి, వాసన మారతాయి
నీళ్లలో చేరుతున్న డిటర్జెంట్లు, సబ్బు నురగల ఆనవాళ్లు తాగునీటిని గరళంగా మార్చేస్తున్నాయి
ఆక్సిజన్ స్థాయి (బీఓడీ) తగ్గడంతోజలాశయం నీటిలోని చేపలు, వృక్ష, జంతు ప్లవకాలు చనిపోతున్నాయి. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. జీవావరణ సమతౌల్యం దెబ్బతింటుంది
నీటిలో ఆక్సిజన్ తగ్గి చేపలు, ఇతర జీవజాలం చనిపోతున్నాయి
భారలోహాలు, యాసిడ్లు, ఆల్కలీలు, ఫినాయిల్, సైనేడ్లు, చీడపీడల మందుల అవశేషాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది
నీటిలోని జీవకణాలు చనిపోతాయి. పలు జీవుల మనుగడ ప్రశ్నార్థకమౌతుంది