పరిష్కారమే ధ్యేయం! 

Second Grama Sabha Program Conducted In Ranga Reddy District - Sakshi

పల్లెల్లో రెండోసారి గ్రామసభలు

తొలిసారి నిర్వహించిన గ్రామాల్లోనే ఏర్పాటు 

బాధితుల విజ్ఞప్తులపై ఆరా తీసేందుకు నిర్ణయం 

సోమవారం నుంచి శ్రీకారం!

అధికారుల పనితీరు తెలుసుకునేందుకు

ప్రత్యేకాధికారుల నియామకం 

పంచాయతీల్లో ‘(1)బి’ సర్వే నంబర్ల ప్రదర్శన 88 శాతం సర్వే నంబర్లకు డిజిటల్‌ సంతకం పూర్తి 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూసంబంధిత సమస్యల పరిష్కారానికి పల్లెల్లో మరోసారి గ్రామసభలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. తొలివిడతలో నిర్వహిస్తున్న సభల్లో బాధితుల నుంచి అధిక సంఖ్యలలో దరఖాస్తులు అందుతున్న విషయం తెలిసిందే. ఇందులో నిర్దిష్ట గడువులోపు ఎన్ని పరిష్కరించారో తెలుసుకునేందుకు రెండోసారి సభలు తలపెట్టాలని యంత్రాంగం యోచిస్తోంది. గ్రామసభల్లో అప్పటికప్పుడు కొన్ని సరళమైన సమస్యలు పరిష్కరిస్తున్నప్పటికీ.. మరికొన్నింటికి కొన్ని రోజుల సమయం పడుతోంది. ఈ నిర్దిష్ట గడువులోపు అధికారులు పరిష్కరించారా? లేదా? లేకుంటే ఎందువల్ల జాప్యం జరిగింది.. ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారా? ఇంకేమైనా జఠిల సమస్యలు ఉన్నాయా.. తదితర వివరాలు రాబట్టేందుకు తొలిసారి గ్రామసభలు నిర్వహించిన పల్లెల్లో... రెండోసారి సభలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. వీలైతే వచ్చే సోమవారమే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇదీ పరిస్థితి.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

వారంలో మూడు రోజలుపాటు గ్రామసభలు నిర్వహించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తున్నారు. గత నెలలో ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. రాజేంద్రనగర్‌ మినహా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో సోమ, మంగళ, బుధవారాల్లో గ్రామసభలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని పదుల సంఖ్యల గ్రామాల్లో ఈ సభలు ముగిశాయి. ఒక్కో డివిజన్‌లో సగటున 250 నుంచి 350 వరకు బాధితుల నుంచి అధికారులకు దరఖాస్తులు అందాయి. కొన్ని గ్రామాల్లో సభలు జరిగి దాదాపు నెల రోజులు కావొస్తున్నాయి. ఈ గ్రామాల్లో ఎన్ని దరఖాస్తులకు మోక్షం కలిగిందో రెండోసారి గ్రామసభ నిర్వహించి ఆరా తీయనున్నారు.
 
తప్పులు పునరావృతం కాకుండా..  
సమస్యల పరిష్కారంలో కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేయడానికి కూడా యంత్రాంగం చర్యలు చేపట్టనుంది. గ్రామ సభల నిర్వహణ, అధికారులు తీసుకుంటున్న దరఖాస్తులు, పరిష్కారం తదితర వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పనిచేస్తున్న లేదా ఇతర జిల్లాల అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించే వీలుందని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవంగా రికార్డుల ప్రక్షాళన సమయంలో చాలావరకు కిందిస్థాయి అధికారులు ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని సాకుగా చూపి డబ్బులు దండుకోవడం పరిపాటిగా మారింది. మళ్లీ ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తగా ఆర్‌డీఓ స్థాయి వ్యక్తులను ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
డిజిటల్‌ సంతకం 88 శాతం పూర్తి 
జిల్లా వ్యాప్తంగా 10.98 లక్షల సర్వే నంబర్లలో భూములు ఉన్నాయి. ఇప్పటికే 9.60 లక్షల సర్వేనంబర్లపై ఎటువంటి కిరికిరి లేదు. దీంతో వీటికి సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసేందుకు డిజిటల్‌ సంతకం పూర్తయింది. ఇవిపోను మరో 1.38 లక్షల సర్వే నంబర్లు మిగిలాయి. ఇందులో ప్రభుత్వ భూములకు సంబంధించి 45 వేల సర్వే నంబర్లు ఉన్నాయి. ఈ భూములకు పట్టాదారు పాస్‌ పుస్తకాల జారీ ఉండదు. దీంతో డిజిటల్‌ సంతకం చేయాల్సిన పనిలేదు. ఇక 36 వేలకు సర్వే నంబర్లు.. భూ వినియోగ మార్పిడి కింద ఉన్నాయి. వీటికీ డిజిటల్‌ సంతకంతో పనిలేదు. ఇవన్నీ మినహాయించగా మరో 7,514 సర్వే నంబర్లకు సంబంధించి సంతకం పెండింగ్‌లో ఉంది. 2,200 సర్వే నంబర్లల్లో భూమి కలిగి ఉన్న వ్యక్తులు తమ ఆధార్‌ నంబర్‌ అందజేసేందుకు ఇష్టపడడం లేదు. దీంతో సంతకం చేయడం కుదరదు. మరో 5,300 సర్వే నంబర్లకు సంబంధించి ఆధార్‌ నంబర్లు అందజేసినా.. భూ విస్తీర్ణంలో తేడాలు కనిపించడంతో అధికారులు పెండింగ్‌లో ఉంచారు. ఆర్‌ఎస్‌ఆర్‌ (రీసర్వే సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌) ఆధారంగా వీటిని పరిష్కరించనున్నారు.

(1)బి సర్వే నంబర్ల ప్రదర్శన 
వివాదాస్పదంగా ఉన్న ఆయా సర్వే నంబర్లను (1)బి జాబితాలో అధికారులు చేర్చారు. ఇలా జిల్లావ్యాప్తంగా 40 వేలకుపైగా సర్వే నంబర్లు ఉన్నాయి. అయితే, ఏయే సర్వే నంబర్లను ఈ జాబితాలోకి ఎక్కించారు.. ఎందుకు నమోదు చేశారు.. అనే విషయాలు సంబంధిత రైతులకు తెలియడం లేదు. ఫలితంగా పట్టాదారు పాసు పుస్తకాల కోసం నెలల తరబడి కర్షకులు ఎదురుచూస్తున్నారు. (1)బి జాబితాలో ఉన్న సర్వే నంబర్లను ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. రెండు గ్రామసభల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని దాదాపుగా నిర్ణయించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top