క్వారంటైన్‌ సెంటర్లుగా క్లబ్బులు, పాఠశాలలు | Schools And Clubs Are Converted Into Corona Quarantine Centers | Sakshi
Sakshi News home page

క్వారంటైన్‌ సెంటర్లుగా క్లబ్బులు, పాఠశాలలు

Jul 22 2020 6:56 AM | Updated on Jul 22 2020 6:56 AM

Schools And Clubs Are Converted Into Corona Quarantine Centers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశం మేరకు పలు ముందస్తు జాగ్రత్త చర్యలను యాజమాన్యం తీసుకుంది. 11 ఏరియాల్లో గల కంపెనీ ఆసుపత్రుల్లో ప్రత్యేక కరోనా వార్డుల ఏర్పాటుతో పాటు, క్వారంటైన్‌ సెంటర్లుగా అన్ని ఏరియాల్లో గల సీఈఆర్‌ క్లబ్బులు, కమ్యూనిటీ హాళ్లు, సింగరేణి పాఠశాలలు తదితర భవనాలను సిద్ధం చేయాలని నిర్ణయించిందని సంస్థ డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ మంగళవారం వెల్లడించారు. సింగరేణి వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, వ్యాధి మరింత విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రతి క్వారంటైన్‌ సెంటర్‌లో ఒక డాక్టరు, అవసరమైన వైద్య సిబ్బంది ఉండి 24 గంటలు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. క్వారంటైన్‌లో  ఎవరికైనా వ్యాధి ముదిరితే వారికి హైదరాబాద్‌లో అత్యవసర సేవలందించడానికి కంపెనీ 3 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా కరోనా వ్యాధి సోకిన వారికి వైద్యం కోసం ఖరీదైన మందుల్ని అందుబాటులో ఉంచుతున్నామని, ఒక్కొక్కటి రూ.14 వేలు ఖరీదైన యాంటీ వైరల్‌ డోసులను కూడా కంపెనీ సమకూర్చుకుంటోందని తెలిపారు. కరోనా సంక్రమించకుండా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వ్యాధి బారిన పడిన అందరికీ పూర్తి స్థాయి వైద్య సేవలందించడానికి కంపెనీ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. 

వైద్య సిబ్బందికి బీమా, 10% అలవెన్సు
సింగరేణిలో కరోనా వైద్య సేవల్లో ప్రత్యక్షంగా పనిచేసే డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అందరికి, రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే ప్రతీ నెల వారి బేసిక్‌ జీతంపై 10 శాతం ప్రత్యేక ప్రోత్సాహక అలవెన్స్‌ ఇక నుంచి సంస్థ చెల్లిస్తుందనీ, ప్రభుత్వం కల్పించిన 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కోవిడ్‌ సేవల్లో పనిచేస్తున్న వారికి వర్తిస్తుందని చెప్పారు.

కేసుల సంఖ్య పెరిగితే మూసివేత
ఏదైనా గనిలో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లయితే అక్కడ పనిచేసే కార్మికుల రక్షణ, ఆరోగ్యం దృష్ట్యా ఆ గనిని కొద్దికాలం పాటు మూసివేయడం జరుగుతుందని డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు. అలాగే గనుల మీద ఇప్పటినుండి రాబోయే రెండు నెలల కాలంపాటు ఏ కార్మిక సంఘం వారికి కూడా సమావేశాలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. కరోనా వ్యాధి సోకిన వారికి ప్రత్యేక క్వారంటైన్‌ సెలవులను యాజమాన్యం మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. ఇన్ని చర్యలు యాజమాన్యం తీసుకుంటున్నందున కరోనాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ధైర్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement