
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు ఇవ్వనుంది. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల కేటగిరీల్లోని పిల్లలకు సంఖ్యతో నిమిత్తం లేకుండా అర్హులందరికీ లబ్ధి చేకూర్చనుంది. దీనిలో భాగంగా 2017–18 వార్షిక సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు ఉపక్రమించింది. ప్రస్తుతానికి దరఖాస్తుల సమర్పణకు గడువు విధించనప్పటికీ నెల రోజుల్లోగా పూర్తిస్థాయిలో స్వీకరించేలా ’సంక్షేమ శాఖలు చర్యలు వేగవంతం చేశాయి.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు...
ప్రీమెట్రిక్ విద్యార్థుల దరఖాస్తుల స్వీకరణను సంక్షేమ శాఖలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నాయి. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాం తంలో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలున్న కుటుంబాల్లోని విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బోనఫైడ్ సర్టిఫికెట్లను దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. బడి పిల్లలకు దీనిపై అవగాహన లేకపోవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఈ బాధ్యతలు అప్పగించాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి.
జిల్లాల వారీగా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి అర్హులందరి నుంచీ దరఖాస్తులు వచ్చేలా చర్యలు చేపట్టాయి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీతో పాటు వికలాంగ కేటగిరీలో 5 నుంచి పదో తరగతి విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ కేటగిరీలో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులే దరఖాస్తు చేసుకునేలా నిబంధనలు విధించింది. విద్యార్థులు ముందుగా ఈపాస్ వెబ్‌సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలి. నమోదు చేసిన దరఖాస్తును ప్రింటవుట్ తీసి దానికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జత చేసి డివిజన్ సంక్షేమాధికారికి సమర్పించాలి. అలా వచ్చిన దరఖాస్తులు డివిజన్ సంక్షేమాధికారి పరిశీలించి ఉపకార వేతన మంజూరీ కోసం జిల్లా సంక్షేమాధికారికి సిఫార్సు చేయాలి.
కేటగిరీల వారీగా ఉపకారవేతనాలు ఇలా..
తరగతి ఉపకార వేతనం
5–8 (బాలురు) 1,000
5–8 (బాలికలు) 1,500
9–10 2,250