దరఖాస్తు చేసుకోలె!

Scholarship Scheme Online Registration Students - Sakshi

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకంపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. అధికారుల అవగాహనలేమి.. పట్టింపులేనితనంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 13 ఇంజినీరింగ్‌ కళాశాలలు, 109 డిగ్రీ కళాశాలలు, 6 ఫార్మసీ, 9 పాలిటెక్నిక్, 8 బీఈడీ కళాశాలలు, 56 ప్రైవేట్‌ కళాశాలలున్నాయి. ఫీజురీయింబర్‌మెంట్‌ ఫ్రెష్, రినివల్‌ చేసుకోవాల్సిన విద్యార్థులు 42,666 మంది ఉన్నట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ, ఇంటర్మీడియట్‌ శాఖల లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఏటా రెన్యూవల్‌ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా చేరిన విద్యార్థులు సైతం రీయింబర్స్‌మెంట్‌కు అర్హులే.

అయితే సాంకేతిక సమస్య..అవగాహన కల్పించాల్సిన కళాశాల యాజమాన్య, సంక్షేమాధికారుల వైఫల్యం వెరసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు వేలాదిమంది కనీసం దరఖాస్తుకు నోచుకోవడంలేదు. ప్రభుత్వం మూడు నెలలు గడువు ఇచ్చినా.. దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. జిల్లాలో గతంతో పోల్చితే దాదాపు 22 వేల మందికిపైగా విద్యార్థులు ఈసారి స్కాలర్‌షిప్‌ దరఖాస్తు చేయకపోవడం విశేషం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఏటా ఫ్రెష్, రెన్యూవల్‌ స్కాలర్‌షిప్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం గడువు విధిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గడువు వచ్చేనెల 30తో ముగియనుంది.

దాదాపు మూడు నెలల నుంచి దరఖాస్తు చేసుకునేందుకుగడువు ఉన్నా.. జిల్లాలో వేలాది మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌ దరఖాస్తులు చేసుకోలేకపోయారు. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది దాదాపు 22 వేల మందికిపైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు దరఖాస్తుకు దూరంగా ఉన్నారు. దరఖాస్తు చేసుకోకపోవడానికి అవగాహన కల్పించడంలో ఆయా కళాశాలల యాజమాన్యం, సంబంధిత సంక్షేమ శాఖలు, ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముందుగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, ఆ కాపీని ప్రింట్‌అవుట్‌ తీసి కళాశాల్లో అందించాల్సి ఉంటుంది. ఆ వివరాలను కళాశాలలు తమ లాగిన్‌ ద్వారా సంబంధిత సంక్షేమశాఖ కార్యాలయాలకు ఆన్‌లైన్‌ ద్వారా పంపిస్తాయి. తిరిగి హార్డ్‌కాపీలను కూడా కార్యాలయానికి పంపిస్తాయి.

అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని నిబంధన పెట్టినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసినప్పటికీ.. సర్వర్‌ సమస్యతో అప్‌లోడ్‌ కాకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. వీటితో పాటు తహసీల్దార్‌ కార్యాలయంలోని సిబ్బంది అరకొరగా ఉండడం, ఉన్న సిబ్బంది ఎన్ని కల ప్రక్రియ షెడ్యూల్‌తో పాటు ఇతరత్రా కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో అనుకున్న సమయానికి «విద్యార్థులకు ధృవపత్రాలు అందించలేకపోతున్నారు.

సర్టిఫికెట్లు పొందడంలోనూ ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లో తాత్సారం, బ్యాంక్‌ ఖాతాలు తెరవడంలో సమస్యలతో నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇదిలా ఉంటే విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకునేట్లు చేయడంలో ఆయా కళాశాలల యాజమాన్యాలు, సంక్షేమ శాఖల వైఫల్యం కూడా కనిపిస్తోంది. సాంకేతిక సమస్యలు పోను ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులకు అవగాహన కల్పించలేకపోయారనే ఆరోపణలున్నాయి. సాంకేతిక శా పం, అవగాహన కల్పించడంలో వైఫల్యం తో మొత్తానికి వేలాది విద్యార్థులు కనీసం దరఖాస్తుకు కూడా నోచుకోని దుస్థితి ఏర్పడింది.

వచ్చేనెల 30 వరకు గడువు..
ప్రభుత్వం మూడోసారి స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పొడిగించింది. వచ్చేనెల 30 వరకు ఫ్రెష్, రినివల్‌కు సంబంధించి విద్యార్థులు దరఖాస్తు చేసుకొని హార్డ్‌కాపీలు కళాశాలలో అందజేయాలి. ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి 2018–19 సంవత్సరానికి గాను 8,491 మంది ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. 6422 మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు ఇంత వరకు దరఖాస్తు చేసుకోలేదు. గడువుముగిసేలోగా దరఖాస్తులు అందజేయకుంటే ఆయా కళాశాలలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top