సూపర్‌ డూపర్‌ కంప్యూటర్లు అవసరమే!

Sakshi Special Interview With Chiranjib Sur

త్వరలో మన యాసను కూడా గుర్తుపట్టే వ్యవస్థలు

‘మూర్స్‌’ను అధిగమించేందుకు గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు

‘ఫీల్డ్‌ ప్రోగ్రామబుల్‌ గేట్‌ అరే’ల ద్వారా హార్డ్‌వేర్‌ సామర్థ్యం పెంపు

హెచ్‌ఐపీసీ అధ్యక్షుడు చిరంజీబ్‌

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ చిక్కుల నుంచి తప్పించుకోవడం మొదలుకొని ప్రాణాంతక కేన్సర్‌ చికిత్స వరకు.. కంప్యూటర్ల వాడకం లేని రంగమంటూ లేదంటే అతిశయోక్తి కాదు.. ఏటా కంప్యూటర్ల వేగం పెరుగుతూనే ఉన్నా.. మరింత వేగవంతమైన యంత్రాల కోసం ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి.. ఎందుకు? నిజంగానే వీటి అవసరముందా? అడ్డంకులు ఏంటి? అధిగమించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయి?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునేందుకు కంప్యూటర్‌ శాస్త్రవేత్త చిరంజీబ్‌ సుర్‌ను ‘సాక్షి’కలిసింది. అత్యధిక సామర్థ్యంతో పనిచేసే కంప్యూటింగ్‌ వ్యవస్థలపై హైదరాబాద్‌లో జరుగుతున్న హెచ్‌ఐపీసీ అంతర్జాతీయ సదస్సుకు అధ్యక్షుడు చిరంజీబ్‌ సమాధానాలు..

ప్ర: హై పర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ (హెచ్‌ఐపీసీ) అవసరం ఏంటి?
జ: చాలా ఉంది. ఉదాహరణకు మనలో చాలామంది ఉపయోగిస్తున్న గూగుల్‌ మ్యాప్స్‌ను తీసుకుందాం. ఇప్పుడైతే మీరు స్క్రీన్‌పై వేలిని కదిలిస్తూ సమాచారాన్ని రాబట్టుకుంటున్నారు గానీ.. భవిష్యత్తులో మీ మాటతోనే అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు. పర్సనల్‌ అసిస్టెంట్ల రూపంలో ఇప్పటికే మాటలకు స్పందించే వ్యవస్థలు ఉన్నా.. హెచ్‌ఐపీసీ కారణంగా భాషతోపాటు.. యాసను గుర్తించి తదనుగుణంగా స్పందించే వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయి. వాతావరణ అంచనాలను కచ్చితంగా తెలుసుకునేందుకు, కొత్త మందుల ఆవిష్కరణలో నూ కీలక ప్రాత పోషించనుంది. సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి అందరికీ ఉపయోగపడే కొత్త కొత్త విషయాలను తెలుసుకునేందుకు, వాటిని ఆచరణలో పెట్టేందుకు కూడా కంప్యూటర్ల వేగం, సామర్థ్యం మరింత పెరగాల్సి ఉంది.

ప్ర: కంప్యూటర్ల వేగం, సామర్థ్యం ప్రతి 18 నెలలకు రెట్టింపు అవుతుందని మూర్స్‌ నిబంధన చెబుతుంది. ప్రస్తుతం ట్రాన్సిస్టర్ల సైజు 9 నానోమీటర్లు. ఇంతకంటే తక్కువ సైజువి తయారు చేసే అవకాశం లేదు. మరి.. కంప్యూటర్ల వేగం పెంచడం ఎలా సాధ్యం?
జ: మూర్స్‌ నిబంధనను అధిగమించేందుకు గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఉపయోగిస్తున్నారు. ‘ఫీల్డ్‌ ప్రోగ్రామబుల్‌ గేట్‌ అరే’ల వంటి పరికరాల ద్వారా హార్డ్‌వేర్‌ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. సాఫ్ట్‌వేర్లు పనిచేసే తీరులో నూ మార్పులు చేయడం ద్వారా డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌కే సూపర్‌ కంప్యూ టర్‌ సామర్థ్యం ఇవ్వగలుగుతున్నాం. వైద్యరంగంలోనూ హెచ్‌ఐపీసీతో అద్భుతాలు సృష్టించొచ్చు. ఒకసారి ఎంఆర్‌ఐ తీసుకుంటే రేడియేషన్‌ వస్తుందని మనకు తెలుసు. దీనిని హెచ్‌ఐపీసీతో అధిగమించవచ్చు.

ప్ర: భారత్‌లో హెచ్‌ఐపీసీ పరిస్థితి ఏంటి?
జ: నేషనల్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ మిషన్‌ను కేంద్రం ఇప్పటికే అమలు చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సమస్యల పరిష్కారానికి సూపర్‌ కంప్యూటర్లను వాడటం, దీనికి తగ్గ మానవ వనరులు అభివృద్ధి చేయడం దీని ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ‘పరమ్‌ శివాయ్‌’ పేరుతో ఓ సూపర్‌ కంప్యూటర్‌ను అభివృద్ధి చేశారు. దేశంలో హైపర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌పై కోర్సులు అందించే విద్యాసంస్థలు తక్కువగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ ఈ రం గంలో కోర్సులు మొదలైతే సమీప భవిష్యత్తులో డేటా, ఆరి్టఫీíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లో దేశ యువత ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. హెచ్‌ఐపీసీ రంగంలో పరిశోధనలను ముమ్మరం చేసేందుకు, అంతర్జాతీయ పురోగతిని అర్థం చేసుకునేందుకు హెచ్‌ఐపీసీ వంటి సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. హెచ్‌ఐపీసీ సమావేశంలో సుమారు 500 మంది దేశ, విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top