
ఎమ్మెల్సీ వే‘ఢీ’
జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ వెలువడటంతో అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి.
⇒ ‘పట్టభద్రుల’ ఎన్నికలపై పార్టీల కసరత్తు
⇒బీజేపీ అభ్యర్థి ప్రకటన.. ప్రచారం షురూ
⇒టీఆర్‌ఎస్‌లో సీఎం ఆశీస్సుల కోసం ఎదురుచూపు
⇒నల్లగొండ జిల్లా నేత నరేందర్‌రెడ్డి పేరు పరిశీలన
⇒బరిలోకి దిగే యోచనలో వామపక్షాలు
⇒ఇంకా ఎటూ తేల్చుకోని కాంగ్రెస్
⇒చర్చల దిశగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ
సాక్షి, ఖమ్మం: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ వెలువడటంతో అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. టీఆర్‌ఎస్ నుంచి పోటీకి సై అంటున్న నేతలు ముఖ్యమంత్రి ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఎటూ తేల్చుకోలేకపోతోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం స్తబ్దుగా ఉన్న రాజకీయాలు ఈ ఎన్నికలతో మళ్లీ ఊపందుకుంటున్నారుు.
పట్టభ్రద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా ఇరవై ఐదురోజుల సమయం ఉంది.
నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణల తంతు ముగిస్తే పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు. ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలోకి దింపకపోవడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. షెడ్యూల్ వెలువడక ముందే బీజేపీ వరంగల్‌కు చెందిన విద్యావేత్త రామ్మోన్‌రావును బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించింది. ఆయన అభ్యర్థిత్వానికి ఇప్పటికే టీడీపీ మద్దతు పలికింది. మూడు జిల్లాల్లో ఆయన ప్రచారాన్ని మొదలు పెట్టారు. టీఆర్‌ఎస్ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. మూడు జిల్లాల నుంచి ఆశావహులు పోటీ పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌దే తుది నిర్ణయం. గురువారం జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో చివరకు ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం.
నామినేషన్ల స్వీకరణ కూడా మొదలు కావడంతో టీఆర్‌ఎస్ నేడో, రేపో తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనుందని తెలిసింది. మూడు జిల్లాల నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పించారని, దాదాపు బండా నరేందర్‌రెడ్డి అభ్యర్థిగా ఖాయమైనట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉండి విజయం సాధించకుంటే ఆ ప్రభావం ఇటు పార్టీ, అటు ప్రభుత్వంపై పడుతుందన్న ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపే ధ్యేయంగా పనిచేయాలని ఇప్పటికే సీఎం ఈ మూడు జిల్లాల నేతలకు సూచించినట్లు తెలిసింది.
అంతర్మథనంలో వామపక్షాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాల తరఫున తప్పకుండా అభ్యర్థిని బరిలోకి దింపాలన్న ఆలోచనలో ఆ పార్టీలున్నాయి. ఇప్పటికే ప్రాథమికంగా ఈ విషయమై సీపీఎం, సీపీఐ చర్చించాయి. మిగతా పార్టీలను కలుపుకొని పోయి మూడు జిల్లాల్లో బలమైన అభ్యర్థిని పోటీకి దించాలన్న ఆలోచనలో ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ నాగేశ్వర్, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, నల్లగొండ జిల్లాకు చెందిన రిటైర్డ్ లెక్చరర్లు మీనయ్య, అందె సత్యం పేర్లు ఆ పార్టీ నేతల పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. పట్టభద్రుల ఎన్నికల్లో పట్టుకోసం టీఆర్‌ఎస్ అభ్యర్థికి పోటీగా తమ అభ్యర్థిని దించాలని వామపక్ష పార్టీల నేతలు భావిస్తున్నారు. ఇటీవల ఈ రెండు వామపక్షాలు ఒకేదారిలో పయనిస్తున్నారుు. ఈ నేపథ్యంలో ఉమ్మడిగా అభ్యర్థిని దింపితే ప్రయోజనం ఉంటుందని, లెఫ్ట్‌పార్టీల సత్తా ఎంటో అధికారపార్టీకి తెలిసేలా ఎమ్మెల్సీ ఎన్నికకు సై అనాలని ఆ పార్టీల నేతలు భావిస్తున్నారు.
చర్చల దిశగా వైఎస్‌ఆర్‌సీపీ
సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో వైఎస్సార్‌సీపీ విజయ దుందుభి మోగించడం, నల్లగొండ జిల్లాలో ఇతర పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీనివ్వడం..వరంగల్ జిల్లాలో బలమైన కేడర్ ఉండటంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై ఆ పార్టీ నేతలు దృష్టిసారించారు. బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలా..? లేక ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా..? అనే విషయమై పార్టీ నేతలు చర్చిస్తున్నారు. కిందిస్థాయిలో పార్టీ కేడర్ బలంగా ఉండడంతో ఈ ఎన్నికల్లో కూడా తమ బలం ఏంటో నిరూపించుకోవాలన్న ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. అయితే ఏం చేయాలనే దానిపై పార్టీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌లో తలోదారి..
ఈ ఎన్నికలపై ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్‌గా దృష్టి పెట్టలేదు. నల్లగొండతో పాటు జిల్లాలో ఆపార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నా అభ్యర్థిని పోటీలోకి దించే యోచనలో ఇంకా మూడు జిల్లాల నేతలు చర్చలకు కూర్చోలేదు. పార్టీ నేతలు కూడా ఈ ఎన్నికపై స్తబ్దుగా ఉన్నారు. పోటీలో ఉండాలా..? వద్దా..? అన్నది అధిష్టానం నిర్ణయానికే ఆ పార్టీ నేతలు వదిలేసినట్లు తెలిసింది. అయితే నల్లగొండ జిల్లాకు చెందిన కొంతమంది ఆశావహులు మాత్రం టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో ఇప్పటికే మంతనాలు చేశారు. ఎంత ఖర్చు అయినా భరించి బరిలోకి దిగుతామని, ప్రతిపక్షంగా ఉండి పోటీ చేయకపోతే క్షేత్రస్థాయిలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని నల్లగొండ జిల్లా నేతలు ఆయనకు వివరించినట్లు సమాచారం. అయితే మూడు జిల్లాల నేతలు తలోదారిలో ఉండటంతో అభ్యర్థి ఎంపిక కొలిక్కి వచ్చేనా..? అనే సందేహాలు నెలకొన్నారుు.
జిల్లాలో పెరిగిన ఓట్లపైనే గురి
గతంలో పట్టభద్రుల ఓటర్లు జిల్లాలో 42,311 మంది ఉన్నారు. వారిలో 30,890 మంది పురుషులు, 11,421 మంది మహిళలు ఉన్నారు. ఈ జాబితాలో ముంపు మండలాల ఓటర్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో 79,866 (ముంపు మండలాలను మినహాయించి) మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 56,503 మంది, మహిళలు 23,360 మంది ఉన్నారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఈ సారి జిల్లా ఓటర్లు 37,555 వరకు పెరిగారు. ఈ నేపథ్యంలో మిగతా రెండు జిల్లాల మాదిరిగానే బరిలో నిలిచే అభ్యర్థులు ఇక్కడ కూడా ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అన్ని పార్టీలు జిల్లాలో ఉండటంతో అభ్యర్థులను విజయతీరం చేర్చడంలో జిల్లా ఓటర్ల తీర్పు కీలకం కానుంది.