
రూ.కోటి విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత
రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి తెలంగాణ, కర్నాటకకు నాలుగు లారీలలో తరలిస్తున్న కోటి రూపాయల విలువైన నిషేధిత గుట్కా, పాన్ మసాల ప్యాకెట్లను చింతూరు పోలీసులు గురువారం పట్టుకున్నారు.
చింతూరు: రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి తెలంగాణ, కర్నాటకకు నాలుగు లారీలలో తరలిస్తున్న కోటి రూపాయల విలువైన నిషేధిత గుట్కా, పాన్ మసాల ప్యాకెట్లను చింతూరు పోలీసులు గురువారం పట్టుకున్నారు. లారీలను సీజ్ చేసి చింతూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చింతూరు సీఐ అమృతరెడ్డి తెలిపిన ప్రకారం... రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ నుంచి రెండు, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నుంచి రెండు లారీలు గుట్కా, పాన్‌మసాలాలు నింపిన 32 టన్నుల బరువున్న 490 బ్యాగులతో ఈ నెల 7వ తేదీన బయలుదేరాయి.
ఇవి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా వెళుతున్నాయి. చింతూరు మండలం చట్టి వద్ద గురువారం సాయంత్రం చింతూరు పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వారు ఈ లారీలను సోదా చేయడంతో గుట్కా, పాన్‌మసాల ప్యాకెట్లు ఉన్న బ్యాగులు కనిపించాయి. రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ నుంచి బయలుదేరిన రెండు లారీలు కర్నాటక రాష్ట్రం బీదర్, గుల్బార్గాకు; గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన రెండు లారీలు హైదరాబాద్ వెళుతున్నట్టుగా పర్నిట్, వే బిల్లుల్లో రాసి ఉంది.
బ్యాగులను పోలీసులు స్వాధీనపర్చుకుని, వాహనాలను సీజ్ చేశారు. కర్నాటకకు రవాణా అవుతున్న లారీలకు సంబంధించిన రూట్ పర్మిట్లలో అవకతవకలు ఉన్నాయని, వాటిని కూడా సీజ్ చేశామని, పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ వివరించారు. సీజ్ చేసిన సరుకుకు పంచనామా నిర్వహించి ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించనున్నట్టు చెప్పారు. లారీల సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు.