వేగంగా వెళ్తున్న లారీ.. ముందు వెళ్తున్న స్కూల్ బస్సును ఢీకొట్టడంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
అల్లాదుర్గం (రంగారెడ్డి జిల్లా) : వేగంగా వెళ్తున్న లారీ.. ముందు వెళ్తున్న స్కూల్ బస్సును ఢీకొట్టడంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. గుర్తించిన స్థానికులు ఆగ్రహించి లారీ డ్రైవర్‌ను చితక బాదారు. ఈ సంఘటన అల్లాదుర్గం మండలం బహిరన్‌దిబ్బ గ్రామ శివారులో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. మండల పరిధిలోని వట్‌పల్లి గ్రామంలోని డాన్‌బాస్కో ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు సాయంత్రం విద్యార్థులను బహిరన్‌దిబ్బ గ్రామంలో దించేందుకు బయలుదేరింది. బహిరన్‌దిబ్బ గ్రామ చౌరస్తా వద్ద వెనుక నుంచి వేగంగా వస్తున్న ఇసుక లారీ ఢీకొంది. దీంతో బస్సు రోడ్డు కిందకు దూసుకుపోయింది.
బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నా ఎవరికీ ప్రమాదం జరగలేదు. లారీ డ్రైవర్ మద్యం సేవించి వేగంగా నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో లారీ డ్రైవర్‌ను చితక బాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రమాదం జరగడంతో చిన్న పిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తల్లిదండ్రులు వచ్చే వరకు పిల్లలు బిక్కు బిక్కుమంటూ అక్కడే కూర్చున్నారు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును చెట్టుకు ఢీకొనకుండా రోడ్డు పక్కకు దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది.ఈ సంఘటనపై అల్లాదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.