ఉల్లి.. తల్లడిల్లి!           | Reducing Onion prices | Sakshi
Sakshi News home page

ఉల్లి.. తల్లడిల్లి!          

May 4 2018 2:26 PM | Updated on Oct 1 2018 2:19 PM

Reducing Onion prices - Sakshi

ఉల్లిగడ్డలను కుప్పగా పోసిన రైతులు

సాక్షి, వికారాబాద్‌, పరిగి : ఉల్లి ధరలు రోజురోజుకు పతనమయ్యాయి. క్వింటాలు ఉల్లి ధర రూ. 600 నుంచి 800 లకు పడిపోయింది. 60 కిలోల ఉల్లి బ్యాగు రూ. 350 నుంచి 400 చొప్పున అమ్ముడవుతోంది.  మూడు నెలల క్రితం వరకు కిలో రూ. 40 నుంచి రూ. 50 ధర పలికిన ఉల్లి  ఇప్పుడు మరింత పడిపోయింది. నాడు వినియోగదారునికి కన్నీళ్లు పెట్టించిన ఉల్లి.. నేడు రైతును పెట్టిస్తోంది.  

పంట వేసే సమయంలో ధరలు ఆకాశాన్నంటడం.. పంట దిగుబడి వచ్చే సమయంలో పాతాళానికి పడిపోవడంతో రైతన్న దిక్కుతోచనిస్థితికి గురవుతున్నారు. ధరల స్థిరీకరణ లేకపోవటమే ఇందుకు కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు అటు రైతును ఇటు వినియోగదారులను నిండా ముంచుతుండగా దళారులకు మత్రం లక్షలు ఆర్జించి పెడుతోంది.  

దిగుబడి బాగానే ఉన్నా..

ఈసారి ఉల్లి రైతుకు మంచి దిగుబడులే వచ్చాయి. అయినప్పటికీ పంట చేతికి వచ్చే సమయానికి ధరలు పూర్తిగా పడిపోవటంతో పెట్టుబడులు కూడా రావటంలేదంటూ రైతులు లబోదిబో మంటున్నారు. మూడు నెలల క్రితం వరకు ఆకాశంలో ఉన్న ఉల్లి ధరలు ఇప్పుడు పూర్తిగా పడిపోయాయి.  

పట్టించుకోని సర్కారు..

ధరలు పెరిగిన ప్రతిసారి సర్కారు కంటితుడుపు చర్యలకే పరిమితమవుతూ వస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడంలేదు. ధరలు పెరిగి పోయి వినియోగదారుడు అల్లాడుతున్నారని సాగు విస్తీర్ణం పెంచేందుకు రాయితీపై విత్తనాలివ్వటం వరకే సర్కారు పరిమిత మయ్యింది. ఆ తరువాత పంట చేతికి వచ్చే సమయానికి రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమవుతోంది.

ప్రస్తుతం రైతులు పంట పొలాల్లోంచి తీయక ముందే ఉల్లి ధరలు క్వింటాలుకు రూ. 700 పలుకుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం రైతును ఆదుకునేందుకు కంటితుడుపు చర్యలు తీసుకోవటం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 

ధరల స్థిరీకరణ ఏదీ?

 రైతులు పండించే పంట ఏదైనా.. అటు రైతులు ఇటు  వినియోగదారుడు నష్టాల పాలు కాక తప్పటంలేదు. కందులు, వేరుశనగ, పత్తి, మొక్క జొన్నలు ఇలా పంట ఏదైనా విత్తనాలు వేసే సమయంలో ధరలు ఆకాశంలో..  రెండు మూడు నెలల్లో పంట చేతికొచ్చే నాటికి ధరలు పాతాళానికి చేరుకోవటం సర్వసాధారణమై పోయింది. ఆరుగాలం పండించిన రైతులు.. కిలో కొనుగోలు చేసి తినే వినియోగదారులు ఇద్దరూ నష్టాలపాలు కాక తప్పటంలేదు. ఇదే సమయంలో కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్న దళారులు మాత్రం అమాంతం ధరలు పెంచేసి లక్షలు ఆర్జిస్తున్నారు. ఇలా ప్రతి సీజ¯న్‌లోనూ పరిస్థితి పునరావృతం కావటానికి కారణం కేవలం ధరల స్థిరీకరణ లేకపోవటమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

పెరిగిన సాగు విస్తీర్ణం

ఉల్లి సాగు విస్తీర్ణం గననీయంగా పెరిగింది. జిల్లాలో సాధారణ సాగు వీస్తీర్ణం 3000 ఎకరాలు కాగా ఈ సారి 4,500 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. పరిగి నియోజకవర్గంలో సాధారణ సాగు 200 ఎకరాలు కాగా ఈ సంవత్సరం 300 ఎకరాల్లో ఉల్లి సాగయ్యింది. దిగుబడి ఎకరానికి 100 క్వింటాళ్ల వరకు వచ్చేది కాగా ఈ సారి 130 నుంచి 150 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అయితే హైబ్రీడ్‌ రకాల ఉల్లి సాగు చేయటంవల్ల దిగుబడి పెరిగి నట్లు ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement