ఐరిస్‌తోనే రేషన్‌!

Ration Distribution With Eyes Punchu - Sakshi

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): పౌర సరఫరాల శాఖ మరో సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఐరిస్‌ ద్వారా లబ్ధిదారులకు రేషన్‌ అందించే ప్రక్రియను మే నెల నుంచి ప్రారంభించనుంది. ఇందుకోసం ఇప్పటికే ఐరిస్‌ మిషన్లు జిల్లాకు వచ్చేశాయి. వీటిని వారం రోజుల్లో రేషన్‌ డీలర్లకు పంపిణీ చేయనున్నారు. మే నెల 1వ తేదీ నుంచి జిల్లాలోని 751 రేషన్‌ దుకాణాల్లో ఇకపై ఈ నూతన విధానం ద్వారా సరుకులు పంపిణీ కానున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా, జవాబుదారీతనంగా చేయడానికి ఇప్పటికే రేషన్‌ దుకాణాల్లో ఈ–పాస్‌ బయోమెట్రిక్‌ విధానం అమలవుతున్న విషయం తెలిసిందే.  రేషన్‌ దుకాణాల్లో అక్రమాలకు అరికట్టేందుకు 2017లో ఈ–పాస్‌ విధానాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో అక్రమాలకు కళ్లెం పడడంతో పాటు ప్రభుత్వానికి మిగులు బియ్యం పెరి గి ఖర్చు తగ్గినట్లయింది. అయితే, కొంత మంది లబ్ధిదారుల వేలి ముద్రలు వివిధ కారణాలతో బయోమెట్రిక్‌ మెషిన్‌లో రాకపోవడంతో వారికి రేషన్‌ అందించడం కష్టమవుతోంది. స్థానిక వీఆర్వో సర్టిఫికేషన్‌ చేస్తేనే రేషన్‌ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం అందజేస్తున్నారు.  
జిల్లాలో మొత్తం 751 రేషన్‌ దుకాణాల పరిధిలో 3,89,827 రేషన్‌ కార్డులు ఉన్నాయి.

ఆయా లబ్ధిదారులందరికీ కలిపి ప్రతి నెలా దాదాపు 8,185 మెట్రిక్‌ టన్నుల బియ్యంతో పాటు కిరోసిన్, గోధుమలను ఈ–పాస్‌ విధానంతో అందజేస్తున్నారు. వేలి ముద్రలు రాక ప్రతి నెలా దాదాపు 5,500 మందికి పైగా లబ్దిదారులు వీఆర్వో సర్టిఫికేషన్‌తో సరుకులు పొందాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే రేషన్‌ డీలర్లు వీఆర్వోలతో కుమ్మక్కై చేతివాటం ప్రదర్శించి సరుకులకు కాజేసి ఎక్కువ ధరకు బాక్ల్‌ మార్కెట్‌ తరలిస్తున్నారనే ఆరోపణలు ఇంకా వినిపిస్తున్నాయి. అలాగే లబ్ధిదారులు చనిపోయినా, రేషన్‌ తీసుకోకపోయినా డీలర్‌ వారి సరుకులను పొందినట్లుగా రికార్డుల్లో చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ ఐరిస్‌ విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో నూరు శాతం అక్రమాలకు చెక్‌ పడనుంది. ఐరిస్‌ మిషన్లను, బయోమెట్రిక్‌ మిషన్‌కు అనుసంధానం చేస్తారు. లబ్ధిదారులకు ముందుగా వారి వేలి ముద్రల ఆధారంగా రేషన్‌ ఇస్తారు. వేలి ముద్రలు రాని పక్షంలో ఐరిస్‌ ద్వారా సరుకులు అందజేస్తారు. 

ఇక నుంచి ఐరిస్‌తోనే.. 
ప్రజా పంపిణీలో ఐరిస్‌ విధానం మే నెల నుంచి అమలు కానుంది. ఇందుకు సంబంధించిన ఐరిస్‌ మెషిన్లు జిల్లాకు వచ్చాయి. వీటిని త్వరలో డీలర్లకు అందజేసి వాటి వినియోగంపై అవగాహన కల్పిస్తాం. వేలి ముద్రలు రాని లబ్ధిదారులకు ఈ విధానం ద్వారా, ఇకపై వీఆర్వో సర్టిఫికేషన్‌తో సంబంధం లేకుండా సరుకులు పొందవచ్చు. ప్రజా పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా జరగనుంది.     – కృష్ణప్రసాద్, డీఎస్‌వో   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top