
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాలో భాగంగా జరుగుతున్న రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పౌర సరఫరాల శాఖ కొత్త ప్రయత్నానికి తెరతీసింది. ఇకనుంచి నేరుగా కమిషనర్‌కు రేషన్ ఫిర్యాదులు చేసేందుకు వీలుగా పౌరసరఫరాల భవన్‌లో వాట్సాప్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని శుక్రవారం ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఐటీ స్వరూపంలో పెను మార్పులు మార్పులు తీసుకొచ్చామని, ప్రైవేటు సంస్థలకు దీటుగా రాష్ట్ర ఐటీ శాఖ పనిచేస్తోందని జయేశ్‌రంజన్ అన్నారు.
ఫిర్యాదుల స్వీకరణకు 7330774444 మొబైల్ నంబర్‌ను కేటాయించామని చెప్పారు. 24 గంటల పాటు పనిచేసే ఈ వాట్సాప్ కేంద్రానికి ప్రజలు సంక్షిప్త సందేశాలు, చిత్రాలు, ఆడియో, వీడియో క్లిప్పింగులను పంపవచ్చని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఆ విషయాన్ని 24 గంటల్లో ఫిర్యాదుదారుడికి సందేశం పంపేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
సీసీ కెమెరాల ఏర్పాటు
పౌరసరఫరాల సంస్థ గోదాముల నుంచి రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన 171 ఎంఎల్‌ఎస్ పాయింట్లలో దశల వారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 43 గోదాముల్లో, రెండో దశలో మెదక్, నల్లగొండ కరీంనగర్ జిల్లాల్లో 54, మూడో దశలో వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 34, నాలుగో దశలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 40 గోదాముల్లో, వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం 162 గోదాముల్లో 1,657 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
సాంకేతికత, పౌరదర్శకత, విషయంలో పౌరసరఫరాల శాఖ మరో అడుగు ముందుకేసిందని పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.