పొగాకు మానే క్విట్‌లైన్‌ ఇదిగో 

Quitline number on packets of tobacco products and Cigarette - Sakshi

సిగరెట్‌ తదితర పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై క్విట్‌లైన్‌ నంబర్‌ 

కేంద్రం నిర్ణయం...మానాలనుకునేవారికి కౌన్సెలింగ్‌  

సాక్షి,హైదరాబాద్‌: ధూమపానం, పొగాకు నమలడం వంటి దుర్వ్యసనాల నుంచి బయటపడాలనుకునే వ్యక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా కౌన్సెలింగ్‌ మార్గాన్ని ఎంచుకుంది. ఇందుకోసం పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ‘క్విట్‌లైన్‌ ఫోన్‌ నంబర్‌’ను ప్రచురించాలని నిర్ణయించింది. సెప్టెంబర్‌ 1 నుంచి తయారవుతున్న అన్ని పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ‘1800–11–2356’అనే క్విట్‌లైన్‌ నంబర్‌ను ప్రచురిస్తున్నా రు. ఈమేరకు పొగాకు నియంత్రణ కోసం పని చేస్తోన్న వలంటరీ హెల్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ధూమపానం, పొగాకు నమలడం వంటి వ్యసనాలను మా నుకోవాలనుకునే వాళ్లు ఈ నంబర్‌కి ఫోన్‌ చేస్తే వారికి తగిన సాయం అందుతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో 46 దేశాలు పొగాకు ఉత్పత్తులపై ఇటువంటి క్విట్‌లైన్‌ నంబర్లను ప్రచురిస్తుండగా, ఆసియాలో థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్‌ మాత్రమే ఈ చర్యకు పూనుకున్నాయి. ఇప్పుడు ఆ దేశాల సరసన భారత్‌ చేరనున్నట్లు సంస్థ తెలిపింది.  

ఏటా పది లక్షల మంది..  
సిగరెట్లు, బీడీలు, చుట్టలు ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగంతో దేశంలో ఏటా దాదాపు 10 లక్షల మంది చనిపోతున్నారు. ఆ దురలవాటు నుంచి బయట పడాలన్నా చాలామంది మానుకోలేని పరిస్థితి. అన్ని పొగాకు ఉత్పత్తులపై ‘పొగాకు కేన్సర్‌ కారకం’, ‘పొగాకు వల్ల బాధాకరమైన మరణం సంభవిస్తుంది’వంటి హెచ్చరికలు వ్యాధుల ఫొటోలతో సహా ప్రచురిస్తున్నారు. ఈ ప్రకటనలు ప్యాకెట్లపై 85% స్థలాన్ని ఆక్రమిస్తాయి. రాజస్థాన్‌ హైకోర్టు, సుప్రీంకోర్టుల నిర్ణయంతో 2016 ఏప్రిల్‌ నుంచి ఫొటోలతో ఈ హెచ్చరికలను ప్రచురిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై అనారోగ్య సంబంధిత హెచ్చరికలను ప్రచురించడంలో భారత్‌ మూడో స్థానంలో ఉన్నట్లు కెనడా కేన్సర్‌ సొసైటీ విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది. ఈ విషయంలో మొత్తం 205 దేశాల్లో మన దేశానికి మూడో స్థానం రావడం విశేషం. 

హెచ్చరికలతో మంచి ఫలితాలు..  
పొగాకు ఉత్పత్తులపై ఫొటోలతో కూడిన హెచ్చరికలను ప్రచురించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జరిపిన ఒక సర్వే వెల్లడించింది. ఆ శాఖ ఇటీవల జరిపిన గ్లోబల్‌ అడల్ట్‌ టుబాకో సర్వేలో పొగాకు ఉత్పత్తులపై కనిపిస్తున్న ఆ హెచ్చరికలను చూశాక తమ అలవాటు మానుకోవాలని లేదా తగ్గించుకోవాలని సిగరెట్‌ తాగేవాళ్లలో 62%, బీడీ తాగేవాళ్లలో 54% మంది భావించారని ఆ సర్వే వెల్లడించింది. మొత్తంగా పొగాకు వాడకం ప్రమాదకరమని పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడ్డవాళ్లలో 96% మంది అంగీకరించారని ఆ సర్వే తెలిపింది.

ధూమపానం చేసేవాళ్లలో 55% మంది, పొగాకు నేరుగా నమిలే వాళ్లలో 50% మంది తమ అలవాటును మానుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆ సర్వేలో వెల్లడయ్యింది. అందువల్ల ప్రస్తుతం పొగాకు వ్యసనాన్ని తగ్గించే చికిత్సా కేంద్రాలకు డిమాండ్‌ పెరుగుతున్నట్లు ఆ సర్వే పేర్కొంది.  ‘పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై వ్యాధుల ఫొటోలతో సహా హెచ్చరికలు ప్రచురించడం చెప్పుకోదగ్గ ఫలితాన్నిచ్చింది. అనేక భాషలతో దేశంలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా పొగాకు దుష్ఫలితాలను అర్థమయ్యేట్లు చేయడంలో ఈ హెచ్చరికలు సఫలీకృతమయ్యాయి. అందువల్లే చాలామంది పొగాకు వాడకం ప్రమాదమన్న భావనకు రాగలిగారని’ వలంటరీ హెల్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ అభిప్రాయపడింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top