‘పిరమాల్‌’ విస్తరణ..

Piramal Group To Investment In Telangana - Sakshi

రాష్ట్రంలోని ఫార్మా విస్తరణకు నిర్ణయం

దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన పిరమాల్‌ గ్రూప్‌ చైర్మన్‌

గూగుల్‌ సీఈవో సహా ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ప్రముఖ పారిశ్రామిక గ్రూప్‌ పిరమాల్‌ రాష్ట్రంలో తనకున్న ఔషధ పరిశ్రమ విస్తరణకు వచ్చే మూడేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లిన పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కేటీఆర్‌తో పిరమాల్‌ గ్రూప్‌ చైర్మన్‌ అజయ్‌ సమావేశమైన అనంతరం ఆ సంస్థ ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటికే తమ కంపెనీలో 1,400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, రూ.500 కోట్ల పెట్టుబడి ద్వారా మరో 500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఔషదాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని, దీనికి అవసరమైన స్థల పరిశీలన కోసం వచ్చే నెలలో రాష్ట్రంలో తమ కంపెనీ ప్రతినిధి బృందం పర్యటించనుందని పేర్కొంది. రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన పిరమాల్‌ గ్రూపునకు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుంచి సంస్థకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 

ఈఓడీబీ ర్యాంకింగ్స్‌ మేరకు నిర్ణయం..
ప్రస్తుతం రాష్ట్రంలో తనకున్న ఔషధ పరిశ్రమ విస్తరణలో భాగంగా కొత్త తయారీ బ్లాకులు ఏర్పాటు చేయడం, వేర్‌హౌస్‌ విస్తరణ పనులకు రూ.500 కోట్లను ఖర్చు చేయనున్నట్టు పిరమాల్‌ గ్రూపు తెలిపింది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న తమ ప్లాంట్లను హైదరాబాద్‌కు తరలించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని పేర్కొంది. రాష్ట్రంలో పరిశ్రమల అనుకూల ప్రభుత్వం, విధానాలతో పాటు సరళీకృ వ్యాపారం (ఈఓడీబీ) ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. హైదరాబాద్‌ నగరంలో ఉన్న ఇతర కంపెనీలను కూడా కొనుగోలు చేసి తన తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా, హెల్త్‌ కేర్, సురక్షిత తాగునీరు, డిజిటల్‌ విలేజ్‌ వంటి కార్యకలాపాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో తమకు అన్ని అనుమతులు కలిగిన మూడు తయారీ బ్లాకులు ఉన్నాయని, జీరో డిశ్చార్జ్‌ విధానంలో, పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని విధంగా తమ పిరమాల్‌ గ్రూప్‌ పనిచేస్తుందని పేర్కొంది. 

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌తో కేటీఆర్‌ సమావేశం 
మంత్రి కేటీఆర్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో గూగుల్, ఆల్ఫాబెట్‌ కంపెనీల సీఈవో సుందర్‌ పిచాయ్‌తో సహా పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. హైదరాబాద్‌లో గూగుల్‌ కార్యకలాపాలు, భవిష్యత్తు విస్తరణ అవకాశాలపై చర్చించారు. ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్, డిఫెన్స్‌ కంపెనీ బే సిస్టమ్స్‌ చైర్మన్‌ సర్‌ రోజర్‌ కార్‌ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. రాష్ట్రానికి ఏరోస్పేస్, డిఫెన్స్‌ రంగాలు ప్రాధాన్యత రంగాలని కేటీఆర్‌ ఆయనకు వివరించారు. ఇప్పటికే పలు ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్, డిఫెన్స్‌ కంపెనీలు హైదరాబాద్‌ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలియజేశారు. రాక్‌వెల్‌ అటోమేషన్‌ సీఈఓ, అధ్యక్షుడు బ్లేక్‌ డీ మారెట్, జపాన్‌ ఫార్మా దిగ్గజం టకెడా ఫార్మా వాక్సిన్‌ బిజినెస్‌ యూనిట్‌ అధ్యక్షుడు రాజీవ్‌ వెంకయ్య కేటీఆర్‌ వేర్వేరుగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌ భారత్‌కు లైఫ్‌ సైన్సెస్, ఫార్మా రంగ రాజధానిగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. మహీంద్రా అండ్‌ మహీంద్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ కే గోయాంక, కేపీఎంజీ గ్లోబల్‌ చైర్మన్, సీఈఓ బిల్‌ థామస్, ఐడీఓ సాండీ స్పీచర్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సీటీఓ కల్యాణ్‌ కుమార్‌ సైతం మంత్రితో సమావేశమయ్యారు.

ప్రత్యేకత చాటుకున్న తెలంగాణ పెవిలియన్‌
దావోస్‌లో పర్యటిస్తున్న పారిశ్రామిక, ప్రభుత్వ వర్గాలకు తెలంగాణ పెవిలియన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దావోస్‌ పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఏర్పాటు చేసిన ఈ పెవిలియన్‌ను అనేక మంది ప్రముఖులు సందర్శిస్తున్నారు. భారత్‌ నుంచి తెలంగాణతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు మాత్రమే ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేశాయి. తెలంగాణ పెవిలియన్‌లో ఒక రిసెప్షన్‌ కేంద్రంతో పాటు, రెండు సమావేశ గదులు, ఒక వెయిటింగ్‌ గది ఏర్పాటు చేశారు. వర్చువల్‌ రియాలిటీ లాంజ్‌లో తెలంగాణకు సంబంధించిన వర్చువల్‌ రియాలిటీ ప్రజెంటేషన్‌ వీక్షించే అవకాశాన్ని సందర్శకులకు కల్పించారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, పారిశ్రామిక విధానం, వార్షిక నివేదికల సమాచారం కూడా తెలంగాణ పెవిలియన్‌లో అందుబాటులో ఉంచారు. కేవలం పారిశ్రామిక, పెట్టుబడుల సమాచారమే కాకుండా హైదరాబాద్‌ నగర చరిత్ర, టూరిజం ప్రత్యేకతలను కూడా పెవిలియన్‌ గోడలపైన అంటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top