రాష్ట్రంలో ఫార్మా కంపెనీల హవా

Pharma companies wave in the state - Sakshi

20 వేల పరిశోధక, 50 వేల ఇతర ఉద్యోగాలకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగం హవా కొనసాగుతోంది. ఔషధ పరిశోధనలు, తయారీ రంగాల్లో ఆసియా ఖండంలోనే అగ్రగామిగా ఉన్న రాష్ట్రం... గత నాలుగేళ్లలో అనేక కొత్త కంపెనీలను అకర్షించింది. అలాగే ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలూ విస్తరణ ప్రణాళికలు అమలు చేయడంతో ఫార్మా రంగం మరింత అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఫెర్రింగ్‌ ఫార్మా, కెమో ఫార్మా, జీఎస్‌కే, సినర్జీ, స్లే బ్యాక్‌ ఫార్మా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి.స్థానికంగా ఉన్న నొవార్టిస్, బయోలాజికల్‌ ఈ, లారుస్‌ ల్యాబ్స్, పల్స్‌ ఫార్మా  కంపెనీలు విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి.  టీఎస్‌ ఐపాస్‌ ప్రకటించిన 2015 జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి 700 కంపెనీల ఏర్పాటు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  సుమారు వంద వరకు పరిశోధనలు, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) రంగ కంపెనీలున్నాయి. ఇందులో 80 శాతం ఇప్పటికే తమ ఉత్పత్తులు ప్రారంభించాయి. 

రూ. కోట్లలో పెట్టుబడులు.. 
కొత్త ఫార్మా సంస్థల ఏర్పాటు, విస్తరణ ద్వారా 20 వేల ఉన్నతస్థాయి పరిశోధన ఉద్యోగాలతోపాటు 50 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ రంగంలో గత నాలుగేళ్లలో రాష్ట్రం రూ. 10,222 కోట్ల పెట్టుబడులను రాబట్టగలిగింది. ఇందులో రూ. 3 వేల కోట్లు అర్‌ అండ్‌ డీ రంగంలో వచ్చాయి. ఫార్మా ఎగుమతుల్లోనూ రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధించింది. కేవలం లైఫ్‌ సైన్సెస్‌ రంగం ఒక్కటే మొత్తం 36 శాతంతో సింహభాగాన్ని ఆక్రమించింది. జాతీయ సగటు 1.18 శాతమే ఉండగా తెలంగాణ  మాత్రం గత నాలుగేళ్లలో ఎగుమతులను 2.41 శాతానికి పెంచుకుంది. అంటే దేశ సగటుకు రెట్టింపు పెరుగుదలతో ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.  ఫార్మా సంబంధ శిక్షణ కార్యక్రమాల్లోనూ రాష్ట్రం ముందంజలో ఉంది. ఇప్పటికే యూఎస్‌ ఫార్మకోపియా (US Pharmacopeia) తో కలసి ఒక శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి వర్సిటీ గ్రాడ్యుయేట్లకు ఫార్మా రంగంలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు వీలుగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 

ప్రభుత్వ విధానాలకు దక్కుతున్న ఫలితమిది: కేటీఆర్‌ 
ఔషధ రంగంలో సాధించిన అభివృద్ధిపట్ల మంత్రి కె. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు దక్కుతున్న ప్రతిఫలంగా అభివర్ణించారు. రాష్ట్రానికి సాధ్యమైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడంతోపాటు వాటి ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ప్రస్తుతమున్న ఫార్మా రంగ పెరుగుదలతోపాటు ఇక్కడి పరిశ్రమ విలువను రెట్టింపు చేసి 100 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లాలనే దీర్ఘకాల లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top