లాక్‌డౌన్‌కు నై..

People Not Following Lockdown Rules In Telangana - Sakshi

యథేచ్చగా నిబంధనల ఉల్లంఘన

కరోనా భయం నిల్‌.. 

చిన్నబోయిన లాక్‌డౌన్‌

రోడ్లెక్కి నగరవాసుల షికార్లు

మటన్, చికెన్‌ కోసం ఎగబడిన జనం

సాక్షి, హైదరాబాద్‌ : ‘కరోనా దేశాన్ని చుట్టబెట్టేస్తోంటే.. ఇటలీ వాసులు ఎంజాయ్‌ చేస్తూ కూర్చున్నారు’. చైనాలో కరోనా పంజా విసురుతూ ఇటలీని చేరిన వేళ అక్కడి ప్రజలు దాన్ని పట్టించుకోకుండా విందు వినోదాలతో ఎంజాయ్‌ చేశారు. ఫలితంగా ఆ దేశం ఇప్పుడు అనుభవిస్తోన్న బాధను ప్రపంచం కళ్లారా చూస్తోంది. కరోనా కోరలు చాస్తూ యూఎస్‌ను చుట్టుముడుతున్న వేళ అమెరికాలోని బీచ్‌లు జనం చిందులతో హోరెత్తాయి. ఇప్పుడా నిర్లక్ష్యం తాలూకు ఫలితాన్ని అమెరికా అనుభవిస్తోంది. రెండు వారాల క్రితం వరకు కరోనా మనల్నేం చేయలేదనే ధీమా.. కానీ మన దగ్గరా ఇప్పుడు పాజిటివ్‌ కేసులు వేయిని మించాయి. గాంధీ ఆసుపత్రి ప్రత్యేక వార్డు కరోనా బాధితులతో కిక్కిరిసిపోతోం ది. మన మధ్య ఎంతమంది వైరస్‌ సోకిన వారు తిరుగుతున్నారో తెలియని పరిస్థితి. కానీ మన జనం మాత్రం దీన్ని పట్టించుకోవట్లేదు. ఆదివారం కనిపించిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం.(లాక్‌డౌన్‌ 15న ఎత్తేసే చాన్స్‌ లేదు)

మాంసం మళ్లీ దొరకదన్నంతగా..
నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ వేళ ఉదయం నుంచి సాయంత్రం ఆరు వరకు బయటకు వచ్చేందుకు అవకాశం కల్పించింది. కానీ సామాజిక దూరాన్ని పాటించాలని ఆదేశించింది. జనం జిహ్వ చాపల్యం ముందు ఈ నిబంధన బలాదూర్‌ అయింది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాంసం మార్కెట్లు, దుకాణాలపైకి ఇక ఇప్పట్లో మాంసం దొరకదేమో అన్నట్టుగా జనం ఎగబడ్డారు. ‘దూరం’సంగతి దేవుడెరుగు ఒకరిపై ఒకరు పడిపోతూ, తోసుకుంటూ తండ్లాడారు. గుంపులో ఎవరు తుమ్మినా, దగ్గినా.. ఆ జనం మధ్య కరోనా బాధితులు ఉంటారేమోనన్న కనీస అనుమానం, దాని నుంచి ఉత్పన్నమయ్యే భయం ఎవరిలోనూ కనిపించలేదు.

సాధారణ ఆదివారాల్లో కనిపించే రద్దీ కంటే ఈ ఆదివారం జనం దూకుడు ఎక్కువ ఉండటం ఆశ్చర్యపరిచింది. అధికారులు, పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ‘నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ప్రభుత్వమే అనుమతించినందున మేమెలా నియంత్రించగలం?’’అని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. మనుషుల మధ్య మీటరు దూరం ఉండేలా మార్కింగ్‌ చేసినా జనం దాన్ని ‘చెరిపేశారు’. రాష్ట్రం మొత్తం ఇవే దృశ్యాలు కనిపించాయి. చికెన్, మటన్, చేపలు అమ్మేందుకు తాత్కాలిక కొత్త దుకాణాలు కూడా వెలియడం విశేషం.

ఆసుపత్రి పేరుతో రోడ్లపైకి..
లాక్‌డౌన్‌ సందర్భంగా ఒకరిళ్లకు ఒకరు వెళ్లటం తగ్గింది. ఆదివారం ఆ లోటునూ పూడ్చేసుకున్నారు. పోలీసులు అడ్డుకోకుండా ఆసుపత్రి పాత రిపోర్టులు, మందులు పట్టుకుని రోడ్డెక్కారు. ఎక్కడైనా పోలీసులు ఆపితే ఆసుపత్రులకు వెళ్తున్నామనో, మందులు కొనుక్కుని ఇళ్లకు వెళ్తున్నామనో చెప్పి షికార్లు కొట్టారు. స్నేహితులు, బంధువుల ఇళ్లకెళ్లి విజయవంతంగా ఆంక్షలు జయించామని ఘనంగా చెప్పుకున్నారు. ద్విచక్రవాహనాలపై ఒక్కరే వెళ్లాలన్న నిబంధన అమలు కాలేదు. సాధారణ రోజుల్లో ట్రాఫిక్‌ పోలీసులు చలానా వేస్తారన్న భయంతో ట్రిపుల్‌ రైడింగ్‌కు జంకేవారు. ఈ ఆదివారం ఆ భయం కూడా లేకుండా దూసుకుపోయారు. కొన్నిచోట్ల ట్రాఫిక్‌ జాంలు ఏర్పడే సంఖ్యలో కార్లు రోడ్డెక్కాయి.

ప్రభుత్వం పునరాలోచించాల్సిందే!
లాక్‌డౌన్‌లో బయటకు వచ్చే వెసులుబాటు సమయాన్ని ప్రజలు దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆదివారం నాటి పరిస్థితి చూశాక, వెంటనే వెసులుబాటు వేళలను తగ్గించాలన్న ఆలోచనకు వచ్చిందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పోలీసు శాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం సాయంత్రం ఆరు తర్వాత అమల్లోకి వస్తున్న కర్ఫ్యూ సమయాన్ని పెంచి, రోడ్లపైకి వచ్చే సమయాన్ని కుదించాలని భావిస్తున్నట్టు సమాచారం.
(‘గాంధీ’ వైద్యులు ధైర్యం చెప్పడం వల్లే.. కోలుకున్నా)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top