వాట్సాప్‌లో పల్లె పోరు 

Panchayat Elections Whatsapp War In Villages - Sakshi

రామారెడ్డి: సాధారణ ఎన్నికలు ముగిసి నెల రోజులు పూర్తి కాకుండానే పంచాయతీ ఎన్నికలతో పల్లెలు వేడెక్కాయి. అధికారికంగా పంచాయతీ రిజర్వేషన్లు ప్రకటించక పోయినప్పటికీ, అనధికారికంగా ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్‌ వచ్చిందో అభ్యర్థులకు క్లారిటీ వచ్చేసింది. ఇక ఆగేదిముంది.. రిజర్వేషన్లు అనుకూలించిన ఆశావహులు వాట్సాప్‌ వేదికగా అప్పడే ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. నేటి రోజుల్లో వాట్సాప్‌ సహా సామాజిక మాధ్యమాలు అందరి వినియోగిస్తున్న సంగ తి తెలిసిందే. దీంతో ఆశావహులు సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా అప్పుడే ప్రచారం ప్రారంభించారు. తాము గెలిస్తే ఏం చేస్తామో, తమ ప్రణాళిక ఏమిటో వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ చేస్తున్నారు.

సర్పంచ్‌ అభ్యర్థులతో పాటు వార్డు మెంబర్లు సైతం అప్పుడే ‘వాట్పాప్‌ వార్‌’కు తెర లేపారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 526 గ్రామ పంచాయతీలు, 4,642 వార్డులు ఉన్నాయి. ఇక, నిజామాబాద్‌ జిల్లాలో 530 పంచాయతీలు, 4,932 వార్డులు ఉన్నాయి. వీటికి సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే నోటిఫికేషన్‌ రానుంది. నోటిఫికేషన్‌ రాకముందే ఆశావహులు రంగంలోకి దిగారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో ఊదరగొడుతున్నారు. 

గ్రూప్‌లలో.. 
పల్లెల్లో గ్రామా లు, కులాలు, పార్టీలు, ఇతర సముహాల వారీగా వాట్సాప్‌లలో ప్రత్యేకమైన గ్రూప్‌లు నిర్వహించ డం నేటి రోజు ల్లో సర్వసాధారణం అయిపోయింది. ఒక గ్రామానికి చెందిన అన్ని పార్టీలు, కులాలు, వృత్తుల వారందరినీ కలిపి తయారు చేసిన గ్రామ గ్రూప్‌లు కూడా అధికంగానే ఉన్నాయి. ఎన్నికల వేళ అందరు ఉన్న గ్రూప్‌ల్లో అభ్యర్థుల పోస్టులతోనే సమస్యగా మారే అవకాశాలున్నాయి. గతంలో రామారెడ్డి మండలంలో వాట్సాప్‌ గొడవలు పోలీస్‌స్టేషన్‌ దాకా వెళ్లిన ఘటనలు ఉన్నాయి. దీంతో ఎన్నికల వేళ అభ్యర్థులతో పాటు సభ్యులు జాగ్రత్తలు వహించడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

గ్రూప్‌లను ఆపేయొచ్చు.. 
ఘర్షణ వాతావరణం ఏర్పడేలా పోస్టులు పెట్టడం, ఎక్కడి నుంచో వచ్చిన పోస్టులను ఫార్వర్డ్‌ చేస్తూ, పంచాయతీ ఎన్నికల్లో ఎదుటి అభ్యర్థులను ఇబ్బందికి గూరి చేసే విధంగా పోస్టులు పెడితే గొడవలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత దూషణలకు దిగితే గ్రూప్‌ అడ్మిన్లు, సామాన్య సభ్యులకు ఇబ్బంది కల్గే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో గ్రూప్‌ అడ్మిన్లు కానీ లేదా గ్రూప్‌ ఏర్పాటు చేసిన వారు కానీ గ్రూప్‌ను తాత్కాలికంగా గ్రూప్‌ అడ్మిన్లు మాత్రమే పోస్టులు చేసేలా వాట్సాప్‌లో సెట్టింగ్‌ చేసుకోవచ్చు. దీని వల్ల సభ్యులందరికీ గ్రూప్‌ల్లో పోస్టులు చేసే అవకాశం ఉండదు. తద్వారా గ్రూప్‌ అడ్మిన్లు ముగ్గురు నలుగురే ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉండవు. లేదంటే వ్యక్తిగత దూషణలు, ఇతరుల మనోభావలు కించపరిచేలా పోస్టులు పెట్టడం వల్ల పోలీసులకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే గ్రూప్‌ అడ్మిన్లతో పాటు సభ్యులకు ఇబ్బందులు తలెత్తుతాయి.

హద్దు దాటితే చర్యలు తప్పవు 
సోషల్‌ మీడియా లో ఎవరికి వారు స్వేచ్ఛగా ప్రచా  రం చేసుకోవచ్చు. ఒకరినొకరు అడ్డుకోవడానికి వీలు లేదు. మోడల్‌ కోడ్‌ అమల్లో ఉన్నన్ని రోజులు ఎన్నికల నియమాళిని పాటించాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. 
– భిక్షపతి, కామారెడ్డి రూరల్‌ సీఐ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top