తర్జనభర్జన

Telangana Panchayat Election Reservation Pending - Sakshi

రిజర్వేషన్ల ప్రకటనలో జాప్యం

ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ

మోర్తాడ్‌ (బాల్కొండ): స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపుపై సర్కారు ఇంకా తేల్చడం లేదు. సామాజిక వర్గాల వారీగా లెక్కలు తేలిన రిజర్వేషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో ఆశావహుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో సామాజిక వర్గాల వారీగా కేటాయించే రిజర్వేషన్ల శాతాన్ని తేల్చినప్పటికీ, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయడానికి అవసరమైన మార్గదర్శకాల జారీలో సర్కారు జాప్యం చేస్తోంది. రిజర్వేషన్లపై స్పష్టత కరువైంది. దీంతో త్వరలో జరుగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏ పంచాయతీ ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారు, రిజర్వేషన్లను ఏ విధంగా ప్రకటిస్తారు అనే దానిపై ఆశావహులు తర్జనభర్జన పడుతున్నారు.
 
కొత్త రిజర్వేషన్లే! 
గిరిజన తండాలను, ఆమ్లెట్‌ గ్రామాలను కొత్తగా పంచాయతీలుగా గుర్తించడంతో పంచాయతీల సంఖ్య పెరిగింది. నిజామాబాద్‌ జిల్లాలో 530    పంచాయతీలు, 4,932 వార్డులు ఉండగా, 6,69, 834 మంది ఓటర్లు ఉన్నారు. కామారెడ్డి    జిల్లాలో 526 పంచాయతీలు, 4,642 వార్డుల్లో మొత్తం 5,13,204 మంది ఓటర్లు ఉన్నారు. అయితే, కొత్త పంచాయతీల ఏర్పాటు నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతంలోని రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకోకుండా కొత్తగా రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉంది.

అయితే, పంచాయతీల్లో రిజర్వేషన్ల శాతం 50 శాతానికి మించకూడదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు 50 శాతం ఉండేలా ప్రభుత్వం లెక్క తేల్చింది. బీసీలకు 23.81 శాతం, ఎస్సీలకు 20.46 శాతం, ఎస్టీలకు 5.73 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు మాత్రం జారీ చేయలేదు.

అంతా గందరగోళం.. 
గిరిజన తండాలను ప్రభుత్వం పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. అయితే, ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గిరిజన పంచాయతీలను పూర్తిగా ఆ సామాజిక వర్గానికే రిజర్వు చేయాల్సి ఉంది. ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లను ప్రకటిస్తే రిజర్వేషన్ల శాతం 50కి మించి పోతుంది. అయితే, హైకోర్టు మాత్రం రిజర్వేషన్ల శాతం 50కి మించకూడదని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో గిరిజన పంచాయతీల విషయంలో ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచన చేయాల్సి ఉంటుందని రాజకీయ నిపుణులు చెబుతునఆరు. పంచాయతీల్లో సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్ల శాతాన్ని ప్రకటించినా గిరిజన పంచాయతీలకు శాశ్వత ప్రాతిపదికన రిజర్వేషన్లను ప్రకటించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రిజర్వేషన్ల శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. పంచాయతీల రిజర్వేషన్ల విషయంలో గందరగోళం నెలకొనడంతోనే ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయలేదని ప్రచారం జరుగుతోంది.
 
స్పష్టత కరువు. 
అయితే, గిరిజన పంచాయతీలను మినహాయించి ఇతర పంచాయతీలలో రిజర్వేషన్లు ఏ మేరకు ఉండాలో నిర్ణయం తీసుకుని ప్రభుత్వం స్పష్టత ఇస్తేనే ఒక కొలిక్కి వచ్చే అవకాశముందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర స్థాయిలో ఖరారైన రిజర్వేషన్ల శాతం ప్రకారం ఏ జిల్లాకు ఎన్ని పంచాయతీలను ఏ సామాజిక వర్గానికి కేటాయించాలి అనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రిజర్వు చేసిన పంచాయతీల సంఖ్య ఏ జిల్లాకు ఎంత మేరకు కేటాయిస్తారో తేల్చిన తరువాత జిల్లాల్లో మండలాల వారీగా రిజర్వు పంచాయతీల సంఖ్యను నిర్ణయిస్తారు.

ఆ తరువాత ఏ పంచాయతీ, ఏ సామాజిక వర్గానికి రిజర్వు చేస్తారు అనే విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొదట వంద శాతం గిరిజనేతర పంచాయతీలను మినహాయించి ఎస్సీ, ఎస్టీలకు పంచాయతీలను రిజర్వు చేసిన తరువాతనే బీసీ, జనరల్‌ స్థానాలను గుర్తించాలని ప్రభుత్వం సూచించింది. అయితే, ప్రభుత్వం మౌఖికంగానే సూచనలు చేస్తుండగా, వీటికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేయట్లేలేదు. స్పష్టమైన మార్గదర్శకాలు చేస్తేనే రిజర్వేషన్ల ఆంశం కొలిక్కి రానుంది.

చకచక ఏర్పాట్లు.. 
రిజర్వేషన్‌ల ఆంశం కొలిక్కి రాకపోయినప్పటికి, క్షేత్ర స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే బ్యాలెట్‌ పత్రాల ముద్రణ పూర్తి కాగా, పోలింగ్‌ బూత్‌ల గుర్తింపు, పోలింగ్‌ అధికారులకు శిక్షణ తదితర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు ప్రకటించినా తాము మాత్రం ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top