ఏ సర్పంచ్‌ స్థానం  ఏ కేటగిరికో..?

Telangana Panchayat Elections BC Quota Nizamabad - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రకటనపై ఆశావహుల్లో ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్ల కోటాలను ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏ కేటగిరికి కేటాయిస్తారనే అంశంపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తే సర్పంచ్‌గా పోటీ చేయాలని గ్రామాల్లో ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని గ్రామాల్లోని ఆయా కుల సంఘాల నాయకులను మచ్చిక చేసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా తమకు అనుకూలంగా రిజర్వేషన్లు ప్రకటించాలని ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో అధికారులపై ఒత్తిడి చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు.
 
కసరత్తు ముమ్మరం..
జిల్లాలో మొత్తం 530 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 71 గ్రామ పంచాయతీల్లో వంద శాతం గిరిజనులు ఉండగా, ఆ జీపీలను వారికే కేటాయించారు. మిగిలిన 459లో ఎస్సీలకు 20.53 శాతం, ఎస్టీలకు 6.68 శాతం, బీసీలకు 22.79 శాతం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను సర్కారు ఖరారు చేసిన విషయం విదితమే. ఈ లెక్కన జిల్లాలో 459 సర్పంచ్‌ స్థానాల్లో ఎస్సీలకు 101 స్థానాలు, ఎస్టీలకు 31 స్థానాలు, బీసీలకు 98 స్థానాలు కేటాయించారు. ఈ మూడు కేటగిరీల్లో 50 శాతం స్థానాలు మహిళలకే దక్కనున్నాయి. మిగిలిన 229 స్థానాల్లో జనరల్‌ స్థానాలుంటాయి. ఏ గ్రామపంచాయతీ సర్పంచ్‌ స్థానం ఏ కేటగిరికి కేటాయించాలనే అంశంపై జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటా సంఖ్యను ఆయా మండలాల వారీగా జిల్లా కలెక్టర్‌ నిర్ణయిస్తారు. ఏ గ్రామ పంచాయతీని ఏ కేటగిరికి రిజర్వు చేయాలనే అంశాన్ని ఆర్డీవోలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే, ఏ వార్డును ఏ కేటగిరికి కేటాయించాలనే అంశంపై ఆయా మండలాల ఎంపీడీవోలు నిర్ణయిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ జనాభా, బీసీల్లో ఓటర్ల సంఖ్య తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఈ రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారని, రొటేషన్‌ పద్ధతిలో ఎంపిక ఉంటుందని.. ఇలా అనేక ప్రచారాలు జరిగాయి. కానీ జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది.
 
ఈ నెల 29లోపు కసరత్తు పూర్తి.. 
గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను ఈ నెల 29లోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు అధికారులు కసరత్తును ప్రారంభించారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తారు. ఈ నివేదికలను ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పంపిన వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్‌ పరిధిలోని గ్రామపంచాయతీలకు ఒక్కో విడతలో ఎన్నికలను నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top