విద్యార్థులకు పరీక్షే! | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు పరీక్షే!

Published Mon, Jan 7 2019 11:13 AM

Panchayat Elections Disturb Students Exams In Nizamabad - Sakshi

వరుసగా వస్తున్న ఎన్నికలు నాయకులు, అభ్యర్థులు, ఆశావహులకే కాదు.. విద్యార్థులకూ పరీక్షగా మారాయి. ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు అప్పగించడంతో చదువులు ముందుకు సాగడం లేదు. ఓవైపు వార్షిక పరీక్షలు ముంచుకురావడం.. మరోవైపు పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వార్షిక పరీక్షల ఫలితాలపై ఎన్నికల ప్రభావం పడుతుందని భయపడుతున్నారు.

ఎల్లారెడ్డి: విద్యార్థులకు ఎన్నికలు శాపంగా మారుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. ప్రస్తుతం పంచాయతీ సందడి కొనసాగుతోంది. ఆ తర్వాత సహకార సంఘాల ఎన్నికలు, ఆపై పార్లమెంట్‌ ఎన్నికలు.. ఇలా వరుసగా ఎన్నికలు రావడం, ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు కేటాయించడంతో చదువులకు ఆటంకం కలుగుతోంది. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.  

అన్నీ అడ్డంకులే..
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిర్వహించారు. ఇది జూలై నెలాఖరు వరకు కొనసాగింది. దీంతో పాఠాల బోధనకు అవాంతరాలు ఎదురయ్యాయి. ఆపై పంద్రాగస్ట్‌ వేడుకలు.. ఆ తర్వాత దసరా సెలవులు.. బోధన అంతంతమాత్రంగానే సాగింది. అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల అప్పగింత, ఎన్నికల నిర్వహణపై శిక్షణ, పోలింగ్‌ సమయం లో రెండురోజుల సెలవులు.. ఇలా పలుకారణాలతో చదువులు సాగలేదు.. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక అయినా చదువులు పట్టా లెక్కుతాయనుకుంటే.. పంచాయతీ ఎన్నికలు వచ్చిపడ్డాయి. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వ హించనుండడం, ఉపాధ్యాయులకే బాధ్యతలు అప్పగించడం, ఎన్నికల శిక్షణ.. మధ్యలో సం క్రాంతి సెలవులు..

దీంతో ఈ నెలలోనూ బోధన సరిగా సాగేలా కనిపించడం లేదు. ఆ తర్వాత కూడా ఎన్నికలు ఉండడంతో విద్యార్థుల్లో ఆందో ళన మొదలైంది. విద్యార్థులు సన్నద్ధం కాకముం దే పరీక్షలు రానున్నాయి. పదో తరగతి వి ద్యార్థులకు ఈనెల 18 నుంచి గ్రాండ్‌ పరీక్షలు, ఫిబ్రవరి 16 నుంచి ప్రీ ఫైనల్‌ పరీక్షలున్నాయి. మార్చి 16 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పాఠశాలల్లో చదువులు సరిగా సాగ క విద్యార్థు లు పరీక్షలను సన్నద్ధమవుతా రని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
దాదాపు అందరూ

ఎన్నికల విధుల్లో..
జిల్లాలోని 683 ప్రాథమిక, 126 ప్రాథమికోన్నత, 185 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,699 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు మూడు వేల మంది ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఈ నెల 21, 25, 30 తేదీలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులోనూ ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోనున్నారు. సోమవారం నుంచి మొదటి విడత పంచాయతీ ఎన్నికల నా మినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభమవుతుంది.  పోస్ట్‌ గ్రాడ్యుయెట్‌ హెడ్‌మాస్టర్లు, సీనియర్‌ అసిస్టెంట్‌లు రిటర్నింగ్, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా, మిగతా ఉపాధ్యాయులు ఎన్నికల సిబ్బందిగా విధులు నిర్వహించనున్నారు. వీరికి ఇప్పటికే ప్రధాన శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మరో విడత శిక్షణ ఇవ్వనున్నారు.

నామినేషన్ల ప్రక్రియ మొదలుకుని ఎన్నికలు పూర్తయ్యే వరకు స్టేజ్‌–1, స్టేజ్‌–2 అధికారులు సుమారు వారం రోజుల పాటు ఎన్నికల నిర్వహణలో నిమగ్నమవ్వాల్సి ఉంటుంది. వీరితో పాటు ఎన్నికల విధుల్లో నియమితులయ్యే మిగతా ఉపాధ్యాయులు కూడా ఎన్నికల సమయంలో రెండు రోజుల పాటు పాఠశాలలకు దూరం కావాల్సిందే.. ఒకవైపు శిక్షణ కార్యక్రమాలు, ఎన్నికల విధులు.. మరోవైపు పాఠాలు బోధించడం.. దీంతో ఉపాధ్యాయులూ ఒత్తిడికి గురవుతున్నారు. పాఠ్యాంశాలను పూర్తిచేసి రివిజన్‌ చేసేందుకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నామని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.  ఆదివారాలూ పనిచేయాల్సి వస్తోందంటున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పరీక్షల వేళలోనైనా ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement
Advertisement