పల్లె పోరుకు కసరత్తు | Sakshi
Sakshi News home page

పల్లె పోరుకు కసరత్తు

Published Thu, Dec 27 2018 8:46 AM

Telangana Panchayat Elections Arrangement Nizamabad - Sakshi

నిజామాబాద్‌అర్బన్‌/మోర్తాడ్‌: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు వేగంగా కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బంది నియామకంతో పాటు శిక్షణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

సుమారు 12 వేల మంది.. 
ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ప్రీసైడింగ్, సహాయ ప్రీసైడింగ్‌ పోలింగ్‌ సిబ్బంది అందుబాటులో ఉంటారు. జిల్లాలో మొత్తం 4,932 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇందుకు గాను 12,580 మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్‌ నిర్వహించే సిబ్బంది స్టేజీ–2 అధికారులుగా ఉంటారు. వీరు పోలింగ్‌ నిర్వహణ, ఓట్ల లెక్కింపు వంటివి చేపడతారు. ఇందుకు అనుగుణంగా సిబ్బందిని కేటాయిస్తారు. 200 ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రంలో ఇద్దరు, 200 నుంచి 400 వరకు ఓట్లు ఉండే పోలింగ్‌ కేంద్రంలో ముగ్గురు, 400 నుంచి 650 ఓటర్లు ఉండే పోలింగ్‌ కేంద్రంలో నలుగురు పోలింగ్‌ సిబ్బంది ఉంటారు.

650 ఓటర్ల కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే అదనంగా మరో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే పోలింగ్‌ అధికారులకు ఒక దఫా శిక్షణ కార్యక్రమం పూర్తయింది. స్టేజీ–2 అధికారులకు జనవరి 2వ తేదీ వరకు శిక్షణనివ్వనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు 
ముందే శిక్షణ పూర్తికానుంది. ప్రతి గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు నోడల్‌ అధికారులను నియమించారు. 11 విభాగాలకు చెందిన జిల్లాలోని వివిధ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించారు.

ఈసారైనా ఓట్లు ఉండేనా..? 
శాసనసభ ఎన్నికల్లో ఓట్ల గల్లంతు దూమారం లేపింది. సుమారు జిల్లా వ్యాప్తంగా 10 నుంచి 20 వేల వరకు ఓట్లు గల్లంతయ్యాయి. చాలా మంది ఓటర్లు ఓటు హక్కును కోల్పోయారు. ఈసారైనా ఓటర్ల జాబితా సమగ్రంగా ఉంటుందా.. గ్రామీణ పోరులోనైనా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుందా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గత వారం నుంచి జిల్లా వ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు 530 పంచాయతీలకు 4,932 వార్డులకు రిజర్వేషన్ల విధానం అమలులోకి వచ్చింది.

మొత్తం 530 జీపీల్లో 267 గ్రామ పంచాయతీలు మహిళలకు, 263 జనరల్‌కు రిజర్వ్‌ అయ్యాయి. ఇక, వంద శాతం గిరిజనులు ఉన్న 71 పంచాయతీలను వారికే కేటాయించారు. మిగతా చోట్ల 31 కలిపి మొత్తం ఎస్టీలకు 102 జీపీలు రిజర్వ్‌ అయ్యాయి. ఇక, ఎస్సీలకు–101, బీసీలకు–98 గ్రామ పంచాయతీలను కేటాయించారు. ఇక, గ్రామాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది. శుక్రవారం లోపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో అధికార యంత్రాంగం అదే పనిలో నిమగ్నమైంది. గురువారం దాదాపు ఈ ప్రక్రియను పూర్తి, ఈ నెల 29న గెజిట్‌ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

డ్రా పద్ధతిలో మహిళలకు రిజర్వ్‌..  
మహిళలకు కేటాయించిన పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను డ్రా పద్ధతిలో చేపట్టనున్నారు. స్థానిక సంస్థలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించడంతో జిల్లాలో మొత్తం 267 గ్రామ పంచాయతీల సర్పంచ్‌ పదవులు వారికే దక్కనున్నాయి. అయితే, మహిళలకు కేటాయించే సర్పంచ్‌ స్థానాల విషయంలో అధికారులు గతంలో రొటేషన్‌ పద్ధతి పాటించే వారు. అయితే, ఈసారి అలా కాకుండా డ్రా పద్ధతి ద్వారా రిజర్వేషన్లను ప్రకటించనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement