ఉత్పత్తుల విక్రయాలకు సొంత బ్రాండ్‌

Own brand to sell products - Sakshi

రైతు కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కల్తీలేని ఆహార ఉత్పత్తులు

సొంత ఔట్‌లెట్ల ఏర్పాటు.. పీపీపీ పద్ధతిలో ఫుడ్‌పార్కులు

రైతు ఉత్పత్తి సంస్థల నిర్వహణ.. సర్కారుకు ప్రతిపాదన

సాక్షి, హైదరాబాద్‌: కల్తీలేని పరిశుభ్రమైన ఆహార ఉత్పత్తుల విక్రయాలకు సొంత బ్రాండ్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ సూత్రప్రాయంగా నిర్ణయించింది. రోజు వారీ వినియోగించే బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి, కారం, సుగంధ ద్రవ్యాలు తదితర ఆహార ఉత్పత్తులను ఆ బ్రాండ్‌పై సరఫరా చేయనుంది. వాటిని విక్రయించేలా సొంత ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుకోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో పనిచేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. అలాగే పీపీపీ పద్ధతిలో ఫుడ్‌ పార్కులను ఏర్పాటు చేస్తారు.

రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ విధివిధానాలు, రోజువారీ కార్యక్రమాలపై సమితి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రతిపాదనలు తయారుచేసి తాజాగా ప్రభుత్వానికి నివేదించారు. ఆ నివేదికలో కార్పొరేషన్‌ లక్ష్యాలను, విధివిధానాలను వివరంగా తెలిపారు. ఆహార ఉత్పత్తులు, వాటి అనుబంధ విలువ ఆధారిత ఉత్పత్తుల గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్‌ చేపట్టాలని సమితి నిర్ణయించింది. వాటిని సొంత బ్రాండ్‌పై విక్రయించనుంది.

అలాగే రైతులు పండించిన పంటలకు మార్కెట్లో సరైన ధరరాని పక్షంలో జోక్యం చేసుకొని కనీస మద్దతు ధర కల్పించాలని ప్రతిపాదించింది. అందుకు సంబంధించి వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖలు, మార్క్‌ఫెడ్, ఆగ్రోస్, ఆయిల్‌ఫెడ్‌ తదితర సంస్థలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. రైతు నుంచి వినియోగదారుని వరకు ఆహార ఉత్పత్తులు అందేలా గోదాములు, ప్యాకింగ్, కోల్డ్‌స్టోరేజీలన్నింటినీ అందుబాటులోకి తీసుకు వస్తారు. అలాగే ఆహార ఉత్పత్తులను సమీప రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తారు. 
 
సమితుల ద్వారానే అమలు..
వ్యవసాయశాఖ చేపట్టే వివిధ పథకాల అమలంతా రైతు సమన్వయ సమితుల ద్వారానే జరగాలని ప్రతిపాదించారు. రైతుబంధు పథకం, రైతుబంధు బీమా పథకం, పంటల బీమా, రుణాలు, రైతు వేదికలుసహా ఇతర వ్యవసాయ పథకాలన్నింటినీ సమితి ద్వారా అమలుచేయాలనేది రైతు కార్పొరేషన్‌ ఉద్దేశం. ఈ కార్యక్రమాలపై విధానపరమైన నిర్ణయాలను మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) తీసుకుంటారు. ఆ పోస్టును ఇప్పటికే ఏర్పాటు చేశారు.

ఇక క్షేత్రస్థాయిలో అమలును పర్యవేక్షించే కీలక బాధ్యతను ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)కు అప్పగిస్తారు. అందుకోసం ఈడీ పోస్టును మంజూరు చేయాలని ప్రతిపాదించారు. జనరల్‌ మేనేజర్‌ పోస్టునే ఈడీగా మార్చాలని కూడా భావిస్తున్నారు. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పోస్టును కూడా ఏర్పాటు చేస్తారు. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఈడీకి సహకరిస్తారు. రైతులు పండించిన పంటల సరఫరా డిమాండ్‌ను పరిశీలించాల్సిన బాధ్యత డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌దే. ఎగుమతులు ఎక్కడికి చేయాలో నిర్ధారించాలి. రైతు కార్పొరేషన్‌కు వ్యవసాయాధికారులను నియమిస్తారు. అలాగే అకౌంట్‌ ఆఫీసర్‌ను నియమిస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top