బ్రాండ్‌ బాజా విరాట్‌ | Kohlis branding is worth Rs 1900 crores | Sakshi
Sakshi News home page

బ్రాండ్‌ బాజా విరాట్‌

May 25 2025 2:05 AM | Updated on May 25 2025 2:05 AM

Kohlis branding is worth Rs 1900 crores

కోహ్లి బ్రాండింగ్‌ @ రూ.1,900 కోట్లు

టెస్టుల నుంచి తప్పుకున్నా ‘కింగ్‌’కోహ్లీనే 

దాదాపు 40 సంస్థలకు ప్రస్తుతం ప్రచారకర్త 

పుష్కర కాలం కిందటి మాట. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తన చివరి సిరీస్‌ ఆడుతున్నాడు. ఆ సిరీస్‌ తొలి టెస్టులో ఒక యువ ఆటగాడు.. ‘ఎంఆర్‌ఎఫ్‌’స్టిక్కర్‌ అంటించి ఉన్న బ్యాట్‌తో తొలిసారి క్రీజ్‌లో వచ్చాడు. అప్పటివరకు భారత అభిమానుల దృష్టిలో ‘ఎంఆర్‌ఎఫ్‌’బ్యాట్‌ అంటే సచిన్‌దే. ఇప్పుడు మరో యువ ప్లేయర్‌ బ్యాట్‌పై ఫ్యాన్స్‌ ఆ బ్రాండ్‌ను చూశారు. 

ఆ కుర్రాడు సచిన్‌ స్థాయి ఆటను ప్రదర్శించడంలో సఫలమయ్యాడు. అంతే కాదు.. ఆ తరవాత జరిగిన ‘ఎంఆర్‌ఎఫ్‌’ఒప్పందం భవిష్యత్తులో వాణిజ్యపరంగా కూడా బ్రాండింగ్‌ ప్రపంచంలో ఒక సంచలనమైంది. ఆ యువ ఆటగాడే విరాట్‌ కోహ్లి. నాటితో మొదలుపెట్టి అసంఖ్యాక ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు ఫార్మాట్‌లనుంచి తప్పుకున్నా.. బ్రాండింగ్‌ విలువ ఏమాత్రం తగ్గకపోవడం కోహ్లీ కింగేనని రుజువుచేస్తోంది. 

స్పోర్ట్స్‌ వేర్, ఆన్‌లైన్‌ షాపింగ్, బ్యాంకింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, సాంప్రదాయ దుస్తులు, ఎడ్యుకేషన్‌ యాప్, స్నాక్స్, టూరిజం, బెవరేజెస్, న్యూట్రిషన్, ఆటోమొబైల్, భవన నిర్మాణ రంగం... ఇలా విభిన్నమైన రంగాల ఉత్పత్తులకు విరాట్‌ కోహ్లి ప్రచారం చేస్తూ కనిపిస్తాడు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఒప్పందం కుదుర్చుకునే సమయంలో సహజంగానే ఉండే నిబంధనల ప్రకారం ఈ అన్ని ఉత్పత్తులకూ అతను పూర్తి స్థాయిలో ప్రకటనల్లో కనిపించడు. 

కొన్ని అంతర్జాతీయ బ్రాండ్‌లకు వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో పాటు ఆయా ఉత్పత్తులకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో సంవత్సరానికి కనీసం 2–3 చోట్ల వ్యక్తిగతంగా పాల్గొనాల్సి ఉంటుంది. మరికొన్నింటిలో సదరు ఉత్పత్తికి సంబంధించి ఒక సంక్షిప్త వ్యాఖ్య మాత్రమే జోడించే స్వల్ప ప్రకటనలో అతను కనిపిస్తాడు. మరికొన్నింటికి సదరు బ్రాండింగ్‌ మాత్రమే కనిపించే జెర్సీ ధరించి లేదా బ్యాట్‌ చేతపట్టి ఒక ఫొటో ఇస్తాడు. దాన్నే వారు వాడుకోవాలి. ఇలా స్థాయిని బట్టి కోహ్లి బ్రాండింగ్‌ రేటు ఉంటుంది. మార్కెట్‌ అంచనా ప్రకారం అతను ప్రస్తుతం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.  

8 ఏళ్లకు రూ.100 కోట్లు! 
విరాట్‌ కోహ్లి కెరీర్‌లో 2014 నుంచి 2019ని అత్యుత్తమ దశగా చెప్పొచ్చు. వరుస రికార్డుల ప్రదర్శనతో అతని స్థాయి ఎంతో పెరగడంతో పాటు వాణిజ్యపరంగా కూడా అతని విలువ శిఖరాగ్ర స్థాయికి చేరింది. అందుకే మొదటిసారి ఎంఆర్‌ఎఫ్‌ చేసుకున్న ఒప్పందంతో పోలిస్తే తర్వాత చాలా పెద్ద మొత్తం ఆఫర్‌ చేసింది. 2017లో ఎనిమిదేళ్ల కాలానికి రూ.100 కోట్లతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకోవడం అప్పట్లో సంచలనం. 

మరోవైపు అదే సమయంలో ఇంటర్నేషనల్‌ స్పోర్ట్స్‌ బ్రాండ్‌ ‘ప్యూమా’తో బ్రాండింగ్‌ ఒప్పందం అతని కెరీర్‌లో మరో పెద్ద రికార్డు. ‘ప్యూమా’కూడా ఎనిమిదేళ్లకు రూ.100 కోట్లతో జత కట్టడం విశేషం. ‘ప్యూమా’తో కలిసి భాగస్వామ్యంతో కోహ్లి తన సొంత బ్రాండ్‌ను కూడా సృష్టించుకున్నాడు. తన జెర్సీ నంబర్‌ 18ని గుర్తుచేసేలా ‘వన్‌ 8’పేరుతో మార్కెట్లోకి వచ్చిన దుస్తులకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం కోహ్లి దాదాపు 30 ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా.. మరో 10 రకాల వ్యాపారాల్లో అతని భాగస్వామ్యం లేదా అతని పేరు ఉన్నాయి.  

స్టార్టప్‌లలో పెట్టుబడులు
ముఖ్యంగా స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడంలో కోహ్లీ మొదటి నుంచి ఆసక్తి కనబరిచేవాడు. స్పోర్ట్స్‌ కాన్వో, డిజిట్‌ ఇన్సూరెన్స్, రేజ్‌ కాఫీ, వన్‌8 వంటి స్పోర్ట్స్, ఫ్యాషన్, ఆహారం, పానీయాల విభాగాల్లో ఎన్నో స్టార్టప్‌లలో విరాట్‌ పెట్టుబడులు పెట్టాడు. ఐపీఎల్‌ టీమ్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) 17 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేదు. 

కానీ ఆ టీమ్‌కు ఉండే విలువ మొత్తం ఒక్క కోహ్లి వల్లనే వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. లీగ్‌ మొదలైన 2008 నుంచి ఇప్పటి వరకు జట్టు మారని ఒకే ఒక్క ఆటగాడిగా నిలిచిన కోహ్లిని చూపిస్తూనే టీమ్‌ బ్రాండింగ్‌ సాగుతుంది. ఇందులో తన వ్యక్తిగత ప్రకటనకర్తలను కూడా చేరుస్తూ అతను ఆ టీమ్‌ వాణిజ్య అంశాలను కూడా శాసిస్తున్నాడు. 

మరి కోహ్లి విలువ పడిపోతుందా?  
కోహ్లీ టెస్టులనుంచి రిటైర్‌ కావడం అతడి బ్రాండ్‌ మార్కెట్‌ మీద ఏమాత్రం ప్రభావం చూపదని మార్కెటింగ్‌ వ్యూహకర్త దినేశ్‌ అరోరా అంటున్నారు. ‘బ్రాండింగ్‌ ప్రపంచంలో కోహ్లి ఒక సామ్రాజ్యం నెలకొల్పాడు. అది అంత తొందరగా కనుమరుగు కాదు. దానికి పలు కారణాలున్నాయి. కోహ్లి తన అత్యుత్తమ ఫార్మాట్‌ అయిన వన్డేల్లో కనిపిస్తాడు. 

ఐపీఎల్‌లో ఒప్పందం ప్రకారం ఎలాగూ కనీసం 2027 సీజన్‌ వరకు అవకాశం ఉంది. పైగా అతను మైదానంలో ఎక్కువగా కనపడకున్నా ఇప్పటికిప్పుడు ఫ్యాన్స్‌ మరిచిపోయే స్థాయి కాదు అతనిది. సచిన్, ధోని రిటైర్మెంట్‌ తర్వాత కూడా పలు ప్రకటనల్లో ఇంకా కనిపిస్తున్నారు. వారితో పోలిస్తే కోహ్లి బ్రాండింగ్‌ విలువ చాలా ఎక్కువ. కార్పొరేట్‌ సంస్థలు అతనిపై మున్ముందూ నమ్మకాన్ని కొనసాగిస్తాయి’అని ఆయన చెప్పారు.

బాలీవుడ్‌ స్టార్లను దాటి... 
ప్రఖ్యాత బ్రాండింగ్‌ వాల్యుయేషన్‌ సంస్థ ‘క్రోల్‌’ప్రకారం విరాట్‌ ప్రస్తుత బ్రాండింగ్‌ విలువ అక్షరాలా రూ.1900 కోట్లు. 2016 నుంచి 2023 వరకు చూస్తే ఎనిమిదేళ్లలో.. రెండు సార్లు  మినహా ప్రతీ ఏటా అతను బ్రాండింగ్‌ విలువ పరంగా భారత సెలబ్రిటీల్లో అగ్రస్థానంలోనే ఉన్నాడు. గతేడాది కూడా బాలీవుడ్‌ స్టార్లు షారుఖ్‌ ఖాన్, రణ్‌వీర్‌ సింగ్‌లకంటే కూడా కోహ్లి విలువే ఎక్కువగా ఉండటం విశేషం. ఇప్పుడు అతను అంతర్జాతీయ క్రికెట్‌లో టి20లు, టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. ఇకపై వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. టీవీల్లో అతను కనిపించడం కాస్త తగ్గుతుంది.  

ఇన్‌స్ట్రగామ్‌లో పోస్టుకు రూ.10 కోట్లు  
ఇన్‌స్ట్రగామ్‌లో 27 కోట్ల ఫాలోవర్లు ఉన్న కోహ్లి తన ఒక్కో కమర్షియల్‌ పోస్టుకు దాదాపు రూ.10 కోట్లు తీసుకుంటాడని సమాచారం. అతను ఒక మాట చెబితే చాలు కోట్లాది మందికి చేరుతుంది కాబట్టి ఆ మొత్తం చెల్లించేందుకు ఎవరూ వెనుకాడరు.  

విరాట్‌ ప్రచారకర్తగా ఉన్న సంస్థలు  
ప్యూమా, మింత్రా, హెచ్‌ఎస్‌బీసీ, నాయిస్, మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్, బ్లూ స్టార్, ఆడి ఇండియా, మాన్యవర్, టూత్‌సి, గ్రేట్‌ లెరి్నంగ్, లక్సర్, వొలిని, వెల్‌మాన్, వివో, డ్యూరోఫ్లెక్స్, అమెరికన్‌ టూరిస్టర్, ఆవాస్‌ లివింగ్, ఎంఆర్‌ఎఫ్, ఎసిలార్, లివ్‌స్పేస్, హెర్బలైఫ్, హీరో మోటార్స్‌ 

కోహ్లి భాగస్వామిగా ఉన్నవీ.. సొంత కంపెనీలు 
బ్లూ ట్రైబ్, రేజ్‌ కాఫీ, వన్‌8, హైపర్‌ఐస్, చిసెల్‌ ఫిట్‌నెస్, డిజిట్‌ ఇన్సూరెన్స్, రాంగ్‌ క్లాతింగ్, గ్యాలక్టస్‌ ఫన్‌వేర్, ఐఎస్‌ఎల్‌ టీమ్‌ గోవా ఎఫ్‌సీ, నూవా రెస్టారెంట్, స్పోర్ట్స్‌ కాన్వో, టీమ్‌ బ్లూ రైసింగ్, వన్‌8 కమ్యూన్‌ రెస్టారెంట్స్‌ చైన్, యూనివర్సల్‌ స్పోర్ట్స్‌ బిజినెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement