నాలుగున్నరేళ్లలో 4500మంది ఆత్మహత్యలు... | Over 4,500 Suicides in Four And a Half Years | Sakshi
Sakshi News home page

 నాలుగున్నరేళ్లలో 4500మంది ఆత్మహత్యలు...

Nov 30 2018 9:27 AM | Updated on Nov 30 2018 9:27 AM

Over 4,500 Suicides in Four And a Half Years - Sakshi

నాగర్‌కర్నూల్‌ బహిరంగ సభలో అభివాదం చేస్తున్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అభ్యర్థులు

సాక్షి, నాగర్‌కర్నూల్‌:  తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని చెబుతున్న టీఆర్‌ఎస్‌ నాలుగున్నరేళ్ల పాలనలో 4500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఎందుకు చేసుకున్నారో చెప్పాలని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో బీజేపీ అభ్యర్థి దిలీపాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మార్పు కోసం బీజేపీ’ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని, ఆర్థిక ప్రగతిని విస్మరించి నిర్లక్ష్యం చేసిందని, పథకాలు అమలుపర్చడంలో విఫలమైందని విమర్శించారు.

బీజేపీ ప్రభుత్వం పేదలకు రూ.5లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో పథకం ప్రారంభిస్తే తెలంగాణలో అమలుచేయడం లేదని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి నాలుగున్నరేళ్లు అవుతున్నా ముఖ్యమంత్రి అసమర్థత వల్ల అభివృద్ధి జరగడంలేదని విమర్శించారు.

యూపీఏ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.16వేల కోట్లు ఇస్తే మోడీ హయాంలో రూ.లక్షా 15వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చామని అన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించిందన్నారు. దీనినుంచి దృష్టి మరల్చేందుకే రాజ్యాంగ వ్యతిరేకమైన మైనర్లకు 12శాతం రిజర్వేషన్‌ అంటున్నారని చెప్పారు.

టీడీపీ, కాంగ్రెస్‌ల పొత్తు అపవిత్ర కలయిక అని, దీనివల్ల ఎన్టీఆర్‌ ఆత్మ ఘోషిస్తుందని అన్నా రు. కాంగ్రెస్‌ నాయకులు ప్రధాని పదవిని అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వారు ఏర్పాటుచేసే ఒకే ఒక్కపరిశ్రమ అవినీతి పరిశ్రమ అని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరి, పత్తి, గోధుమలకు మద్దతు ధర పెంచిందని, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. లక్ష ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తామని చెప్పారు.  


దిలీపాచారిని గెలిపించాలి  
నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న దిలీపాచారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. దిలీప్‌ ప్రసంగం విన్నానని, మంచి వక్త అని, అసెంబ్లీకి పంపితే నాగర్‌కర్నూల్‌ ప్రజల కష్టాలపై అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పారు. హిందీలో ప్రసంగించిన రాజ్‌నాథ్‌సింగ్‌ మొదట తెలుగులో నాగర్‌కర్నూల్‌ ప్రజలకు అభినందనలు తెలిపారు. అనంతరం హిందీలో ప్రసంగిస్తుండగా జాతీయ కిసాన్‌ మోర్చ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు తెలుగులో అనువదించారు.  


నాగర్‌కర్నూల్‌లో అభివృద్ధి ఏదీ? 
బీజేపీ అభ్యర్థి దిలీపాచారి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పాలనలో నాగర్‌కర్నూల్‌లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని అన్నారు. అభివృద్ధి, సమస్యలను పరిష్కరించకుండా ఓట్లు అడుగుతున్నారని అన్నారు. వారిని ఓటుతో తిప్పికొట్టాలని ప్రజలను కోరారు. ఇంటికో ఉద్యోగం, డబుల్‌ బెడ్రూం ఇల్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీలు అమలుచేయలేదన్నా రు. బీజేపీని గెలిపిస్తే నాగర్‌కర్నూల్‌కు కేంద్రీయ సంస్థలను తీసుకొస్తానని, యువకులకు ఉపాధి కల్పిస్తామని అన్నారు.  


కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు  
కేంద్ర హోంశాఖ మంత్రి మొదటిసారిగా నాగర్‌కర్నూల్‌కు వస్తుండటంతో సభాప్రాంగణం వద్ద, సభా ప్రాంగణానికి చేరుకునే దారిలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉయ్యలవాడ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుని అక్కడి నుంచి కాన్వాయ్‌ ద్వారా సభాస్థలికి చేరుకున్నారు.

దాదాపు గంటసేపు ప్రసంగించారు. 1.45గంటలకు తిరిగి వెళ్లిపోయారు. బహిరంగ సభకు ప్రజలు, బీజేపీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సభలో బళ్లారి ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు సాంబమూర్తి, బంగారు శృతి, కాశీరాజు, నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement