లైట్లు లేవు.. ప్లేట్లు లేవు..

Osmania university Students Protest on Hostel Food - Sakshi

నాణ్యత, రుచి లేని ఆహారంతోఅవస్థలు!

అధిక మెస్‌ బిల్లులతోరోడ్డెక్కుతున్న విద్యార్థులు  

తల పట్టుకుంటున్నఓయూ అధికారులు

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ హాస్టళ్లలో లైట్లు, ప్లేట్లు ఇతర సౌకర్యాలు లేవని, నాణ్యత, రుచి లేని ఆహారానికి ( నెలకు రూ.2000 నుంచి రూ.3000 వేలు) వరకు అధిక మెస్‌ బిల్లు వసులు చేస్తున్నారని, తిన్నా తినకున్న మెస్‌ బిల్లులు వస్తున్నాయని, నిత్యం సమస్యలతో చదువులు  సాగడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ రోడ్డెక్కుతున్న విద్యార్థులకు సర్దిచెప్పలేక, నిధుల కొరత కారణంగా వసతులు కల్పించలేక అధికారులు తలపట్టుకుంటున్నారు. ఓయూ క్యాంపస్‌ కాలేజీల విద్యార్థులతో పాటు నిజాం, కోఠి మహిళా, సికింద్రాబాద్‌ పీజీ, సైఫాబాద్‌ పీజీ కాలేజీల విద్యార్థులు నిత్యం ఆందోళనకు దిగుతున్నారు. హాస్టళ్లు నిర్వహించలేక జిల్లా పీజీ కాలేజీల హాస్టల్స్‌ను ప్రాంభించకుండానే పక్కన పెట్టారు. ఉన్నత విద్య కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే విద్యార్థులు ఓయూ హాస్టళ్లు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకు తీసిపోవని కలగంటూ వర్సిటీలో అడుగుపెడతారు. అయితే ఇక్కడ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి.  కొత్తగా హాస్టల్‌లో చేరే విద్యార్థుల నుంచి ఎస్సీ, ఎస్టీలకు రూ.8000, బీసీలకు రూ.10 వేలు, ఓసీలకు రూ.12 వేలు డిపాజిట్‌ చేయిస్తున్నారు. గదుల కేటాయింపు, సౌకర్యాలు, వసతులు, ఆహారం అందించడంలో అధికారులు విఫలమయ్యారని విద్యార్థులు పేర్కొంటున్నారు.

హాస్టళ్ల నిర్వహణలోమార్పు తేవాలి
ఓయూ హాస్టల్స్‌ నిర్వహణలో మార్పు తేవాలని నవ తెలంగాణ స్టూడెంట్‌ యూనియన్‌ (ఎన్‌టీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షులు బైరు నాగరాజుగౌడ్‌ అధికారులను కోరారు. ఓయూలో అనేక మార్పులు చోటు చేసుకున్న హాస్టల్స్‌ సాంప్రదాయ బద్దంగా పాత పద్దతిలోనే కొనసాగిస్తున్నారన్నారు.  డిపాజిట్‌ పేరుతో వేల రూపాయాలను వసూలు చేస్తున్న అధికారులు అందుకు తగిన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. గదుల కేటాయింపు మొదలు ఆహారం వరకు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. హాస్టల్స్‌ నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థుల చదువుకునే వాతావరణాన్ని కల్పించాలని కోరారు.    – బైరు నాగరాజుగౌడ్‌    ఎన్‌టీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top