సేంద్రియ సేద్యం ఆరోగ్య మార్గం

Organic farming health way - Sakshi

రాష్ట్ర హోంమంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ 

శిల్పారామంలో ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా ఆర్గానిక్‌ ఉత్సవం ప్రారంభం 

ఈ నెల 10 వరకు ఫెస్టివల్‌ , వెయ్యికి పైగా ఉత్పత్తులు

హైదరాబాద్‌: సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనీ, ఇదే అందరి ఆరోగ్యానికి ఉత్తమ మార్గమని రాష్ట్ర హోంమంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ అన్నారు. బుధవారం శిల్పారామంలోని సాంప్రదాయ వేదికలో కేంద్ర మహిళల, పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ’ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా ఆర్గానిక్‌ ఉత్సవాన్ని’ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రెండెకరాల భూమిలో తన తండ్రి సేంద్రియ వ్యవసాయం చేసేవారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయానికి చేయూతనిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లను కేటాయించి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం వల్లే గతంలో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండేవన్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా వివిధ క్లబ్‌ల ద్వారా మహిళలకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మహిళ, పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అజయ్‌ టిర్కీ, సంయుక్త కార్యదర్శి నందితా మిశ్రా మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇలాంటి ఉత్సవాలు దోహదపడతాయన్నారు. మహిళా రైతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. సేంద్రియ ఎరువులతో పండించిన ఉత్పత్తుల అమ్మకాలకు ‘ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా ఆర్గానిక్‌ ఫెస్టివల్‌ ’ఉపకరిస్తుందన్నారు.

ఇందులో రెడ్‌ అండ్‌ బ్లాక్‌ రైస్, చిరుధాన్యాలు, లెంటీస్, కూరగాయలు, సీడ్స్‌ అండ్‌ సీడ్‌ జ్యువెలరీ, సుగంధ ద్రవ్యాలు, ఐస్‌క్రీమ్, సౌందర్య సాధనాలు, వస్త్రాలు, బేకరీ ఉత్పత్తులు, టీ, పండ్లు, తదితరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఉత్సవం ఈ నెల 10వ తేదీ వరకు ఉంటుందనీ సుమారు వెయ్యికి పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డబ్ల్యూసీడీ, ఎస్‌సీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జగదీశ్వర్‌ మాట్లాడుతూ ఇప్పటికే ఎక్కువ భాగం భూమి కలుషితమైందని, పొలాలను మరలా శుద్ధి చేయడానికి 15 నుండి 20 ఏళ్ల సమయం పడుతుందన్నారు. సినీ నటి అమల మాట్లాడుతూ తమ కుటుంబమంతా సేంద్రియ పంటలే తింటామన్నారు. పర్యావరణ పరిరక్షణ ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌డబ్ల్యూసీడీసీ చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, హైదరాబాద్‌ రీజినల్‌ ఆర్గనైజర్‌ సుశీలారెడ్డి, రంగారెడ్డి రీజినల్‌ ఆర్గనైజర్‌ వీరమణిలతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top