గండికి బండి | Operation RTC on Private Busses in this Sankranthi Season | Sakshi
Sakshi News home page

గండికి బండి

Jan 4 2019 9:10 AM | Updated on Jan 4 2019 9:10 AM

Operation RTC on Private Busses in this Sankranthi Season - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థల ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేట్‌ ఆపరేటర్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్‌ ఆర్టీసీలు తొలిసారి ‘సంయుక్త కార్యాచరణ’ చేపట్టాయి. పండగలు, ప్రత్యేక సెలవు రోజుల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా  రెండు సంస్థలు అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నప్పటికీ రెండు సంస్థల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్‌  ట్రావెల్స్‌ నుంచి గట్టి పోటీని  ఎదుర్కోక తప్పడం లేదు. పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అన్ని ప్రధాన రూట్లలో వందల కొద్దీ ప్రైవేట్‌ బస్సులు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో రెండు ఆర్టీసీ సంస్థల  మధ్య సమన్వయంతో బస్సులను నడపాలని నిర్ణయించారు.

సంక్రాంతి సందర్భంగా లక్షలాది మంది నగర వాసులు ఏపీకి తరలి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రెండు ఆర్టీసీ సంస్థలు తమ బస్సుల  నిర్వహణ కోసం ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో మొట్టమొదటిసారి ఏపీఎస్‌ ఆర్టీసీకి చెందిన ఆపరేషన్స్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జయరావు, తెలంగాణ ఆర్టీసీ ఆపరేషన్స్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కొమురయ్యల నేతృత్వంలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు రెండు రోజుల క్రితం ఎంజీబీఎస్‌లో సమావేశమయ్యారు. ప్రైవేట్‌ బస్సులు రాకపోకలు సాగించే అన్ని మార్గాల్లో అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ప్రయాణికులు ప్రైవేట్‌ బస్సుల వైపు వెళ్లాల్సిన అవసరం లేకుండా రెండు సంస్థలు సమన్వయంతో కలిసి పని చేయాలని ఈ సమావేశంలో అవగాహనకు వచ్చారు.

ప్రధాన కూడళ్ల నుంచి తరలింపు
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌ నుంచి సుమారు 25 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం ఉంది. పిల్లలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతోనే  ప్రయాణికుల రద్దీ మొదలవుతుంది. ఇప్పటికే రైళ్లల్లో  బెర్తులు పూర్తిగా నిండిపోయాయి. వెయిటింగ్‌ లిస్టు వందల్లోకి చేరింది. కొన్ని రైళ్లలో ‘నో రూమ్‌’ దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు బస్సులు మినహా మరో మార్గం లేదు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏటా రెండు ఆర్టీసీలు అదనపు బస్సులు నడుపుతున్నప్పటికీ విడివిడిగానే తమ ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. ఏ ఆర్టీసీ బస్సు ఎక్కడి నుంచి బయలుదేరుతుందనే అంశంపై అవగాహన కొరవడుతోంది. ఇది ప్రైవేట్‌ ఆపరేటర్లకు చక్కటి అవకాశంగా మారింది. ఈ  ప్రతికూల పరిస్థితిని అధిగమించి సమన్వయంతో బస్సులను నిర్వహించడం వల్ల రెండు సంస్థలు ప్రైవేట్‌ బస్సుల పోటీని ఎదుర్కోవచ్చని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏపీకి రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి బస్సులను నడిపేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. మియాపూర్, జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, సైనిక్‌పురి, ఏఎస్‌రావునగర్, ఎస్సార్‌నగర్, లక్డీకాపూల్,  కాచిగూడ, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, బీహెచ్‌ఈఎల్, తదితర ప్రధాన కూడళ్లు, నగర శివారు ప్రాంతాలను కేంద్రంగా కనీసం 100 పాయింట్ల నుంచి బస్సులను నడపాలని యోచిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా రెగ్యులర్‌ బస్సులతో పాటు ప్రతి సంవత్సరం సుమారు 5 వేల బస్సులను అదనంగా ఏర్పాటు చేస్తారు. ఈసారి కూడా రద్దీ నేపథ్యంలో అవసరమైతే బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. 

ప్రైవేట్‌ దోపిడీ
పండుగలు, సెలవులు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులపై 50 శాతం అదనపు చార్జీలు విధిస్తుంది. కానీ ప్రైవేట్‌ ఆపరేటర్లు మాత్రం కనీసం రెండు రెట్లు అదనపు దోపిడీకి దిగుతారు. ప్రయాణికులకు మరో గత్యంతరం లేక ప్రైవేట్‌ ఆపరేటర్లు అడిగినంతా సమర్పించుకోవాల్సి వస్తోంది. ప్రతిరోజు సుమారు 1000  ప్రైవేట్‌ బస్సులు ఏపీలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, అమలాపురం, విశాఖ, చిత్తూరు, కడప, కర్నూలు వంటి రద్దీ అధికంగా ఉండే రూట్లలో ఆపరేటర్ల దోపిడీకి అదుపులేదు. ఈసారి సంక్రాంతి రద్దీని ఎదుర్కొనేందుకు తొలిసారి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు సమన్వయంతో  బస్సులను నడపనుండడం ప్రయాణికులకు శుభపరిణామమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement