వెంటాడుతోంది..@30

One Month Complete For Lockdown in Hyderabad - Sakshi

నగరంలో లాక్‌డౌన్‌ విధించి నెల పూర్తి..

సత్ఫలితాలిచ్చిందని నిపుణుల స్పష్టీకరణ

నిర్బంధం లేకుంటే నష్టం తీవ్రంగా ఉండేది..

గ్రేటర్‌లో మార్చి 2న తొలి కేసు

తొలుత ఎన్నారై.. ఆ తర్వాత మర్కజ్‌ లింక్‌ పాజిటివ్‌లే..

మూడో దశ రోగులంతా..తొలి రోగుల ప్రైమరీ కాంటాక్ట్‌లే..

కంటైన్మైంట్‌ క్లస్టర్లతో ఇప్పుడు మరింత ‘కట్టు’దిట్టం

తాజాగా మరో 13 కేసులు

నల్లకుంట/వెంగళరావునగర్‌: కరోనా మహమ్మారి గ్రేటర్‌ వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. రోజురోజుకు కేసుల సంఖ్య మరింత పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా గురువారం మరో 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో కొత్తగా ఇద్దరు అనుమానితులు చేరారు. ప్రస్తుతం ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో 20 మంది అనుమానితులు ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న 20 మందికి పరీక్షలు నిర్వహించగా, రిపోర్ట్‌లో నెగిటివ్‌ వచ్చింది. దీంతో వారిని డిశ్చార్జ్‌ చేశారు. ఇక ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో 18 మంది ఉండగా, వీరిలో 9 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో వారిని ఐసీయూకు తరలించి చికిత్స చేస్తున్నారు. ఐసోలేషన్‌ వార్డులో ప్రస్తుతం మరో తొమ్మిది మంది అనుమానితులు ఉన్నారు. తాజాగా ఒకరు అడ్మిట్‌ కాగా, 11 మంది డిశ్చార్జ్‌చేశారు. ఇక ఆయుర్వేద ఆస్పత్రిలో 109 మంది ఉండగా, వీరిలో 50 మందిని డిశ్చార్జ్‌ చేశారు. మిగిలిన వారి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. 

రాంనగర్‌గుండు వద్ద ఓ వ్యక్తికి కోవిడ్‌ నిర్ధారణ
ముషీరాబాద్‌: రాంనగర్‌గుండు వద్ద కూరగాయల షాపు వద్ద గల ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే 70 సంవత్సరాల వ్యక్తికి కోవిడ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో శుక్రవారం ఉదయం జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ అధికారులు అతనిని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అతని కుటుంబ సభ్యులు నలుగురిని రామంతాపూర్‌లోని హోమియో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. ఇతను గత కొంతకాలంగా షుగర్‌ వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం పలు ఆసుపత్రులకు తిరుగుతుండగా ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్లు అనుమానం వచ్చి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ముషీరాబాద్‌ నియోజకవర్గంలో కోవిడ్‌ యాక్టివ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 7కు చేరుకుంది. 

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి కరోనా పాజిటీవ్‌
జియాగూడ: ఒకే కుటుంబానికి చెందిన 7 మందికి కరోనా పాజిటీవ్‌ వచ్చిన ఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. సబ్జిమండి దర్వేజ్‌ ఫంక్షన్‌హాల్‌కు ఎదురుగా నివసిస్తున్న ఓ కుటుంబంలోని వ్యక్తి గత నెల 17న ఆగ్రా నుంచి మర్కజ్‌ యాత్రికులతో కలిసి నగరానికి వచ్చారు. అనుమానాస్పదంగా ఆమె కుటుంబ సభ్యులను గాంధీ ఆస్పత్రికి తరలించగా అందులో ఏడుగురికి కరోనా పాజిటీవ్‌ వచ్చింది. అంతకు ముందు రోజు ఇద్దరికి పాజిటీవ్‌ వచ్చింది. మొత్తం 9 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. దీంతో సబ్జిమండి ప్రాంతంను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. 

పాతబస్తీ పరిధిలో ముగ్గురికి కరోనా పాజిటీవ్‌..
అబిడ్స్‌: పాతబస్తీ పరిధిలోని ఆసిఫ్‌నగర్‌ నట్రాజ్‌నగర్, జిర్రా ప్రాంతంలోని గంజేషాదర్గా ప్రాంతంలో ముగ్గురికి కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్న ఈ ముగ్గురిని క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహించారు. గురువారం ముగ్గురికి కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో గోషామహాల్‌ సర్కిల్‌లోని రెండు ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. ఆసిఫ్‌నగర్‌ డివిజన్‌ ఏసీపీ శివమారుతి, టప్పాచబుత్ర ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌కుమార్‌ పర్యటించి పోలీస్‌ పికేటింగ్‌ ఏర్పాటు చేశారు. అనంతరం బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. 

గాంధీకి... కరోనా మహిళ
ఖైరతాబాద్‌: సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గాల్‌బ్లాడర్‌ స్టోన్స్‌తో తీవ్ర ఇబ్బంది పడుతున్న మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో శస్త్రచికిత్స నిర్వహించారు. 56 సంవత్సరాల మహిళకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో గురువారం ఆమెను పోలీసులు గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఈమెతో పాటు సన్నిహితంగా మెలిగిన వారిని కూడా క్వారంటైన్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top