నల్లమలలో ‘ఆక్టోపస్‌’ ఎట్రాక్షన్‌

'Octopus' attraction in Nallamala forest

 ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్, శ్రీశైలం రహదారిలో కొత్త పర్యాటక ప్రదేశం

ఆక్టోపస్‌లా మెలికలు తిరిగిన కృష్ణా నదిని వీక్షించేలా వ్యూ పాయింట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో కొత్త పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. నల్లమల అటవీ అందాలు, కృష్ణా తీర సొగసులు, లోయల అందాలను తిలకించేందుకు వీలుగా ఆక్టోపస్‌ వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వ్యూ పాయింట్‌ నుంచి చూస్తే కృష్ణా నదీ ఆక్టోపస్‌లా మెలికలు తిరిగి కనిపిస్తుండటంతో ఆ పేరు పెట్టినట్లు అటవీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌–శ్రీశైలం హైవే మార్గంలో మన్ననూర్‌ నుంచి 42 కి.మీ. దూరంలో, దోమలపెంటకు 5 కి.మీ. ముందు ఈ వ్యూ పాయింట్‌ ఏర్పాటు చేశారు.

శుక్రవారం ఈ మేరకు ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ ఎం.సి.పర్గెయిన్‌ దీన్ని ప్రారంభించారు. సందర్శకులు సేదతీరేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని అందించడం కోసం ఒక వాచ్‌ టవర్, ఫారెస్ట్‌ ట్రయల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పర్గెయిన్‌ పేర్కొన్నారు. వ్యూ పాయింట్‌ సందర్శనకు వచ్చే పర్యాటకులు అటవీ ప్రాంత ప్రశాంతతను కాపాడాలని, ప్లాస్టిక్‌ కవర్లు విసిరేయొద్దని సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top