మోదీపై నామినేషన్ల అస్త్రం!

NRIs contest in Varanasi for the victims of fluorosis - Sakshi

ఫ్లోరోసిస్‌ బాధితుల తరఫున వారణాసిలో ఎన్‌ఆర్‌ఐల పోటీ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన ముఖ్యనేతలపై ఎన్నికల్లో పోటీ చేసేందుకు బాధితులు మూకుమ్మడిగా నామినేషన్లు వేయడం సరికొత్త నిరసన అస్త్రంగా మారింది. పసుపు బోర్డు ఏర్పాటు, మొక్కజొన్నకు మద్దతు ధర హామీలు నెరవేర్చకపోవడంతో ఇటీవల నిజామాబా ద్‌ లోక్‌సభ స్థానానికి సుమారు 200 మంది రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు వేసి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. నల్లగొండ, ప్రకాశం జిల్లాల్లోని ఫ్లోరోసిస్‌ బాధిత ప్రజల తరఫున సరిగ్గా ఇదే తరహా లో ప్రధాని మోదీపై నామినేషన్లు వేసేందుకు రెండు రాష్ట్రాల ఎన్‌ఆర్‌ఐలు సన్నద్ధమవుతున్నారు. ఏప్రిల్‌ 22 నుంచి 28 వరకు వారణాసి స్థానానికి నామినేషన్లను స్వీకరించనుండగా, మే 19న ఎన్నికలు జరగనున్నాయి. కోదాడకు చెందిన ఎన్‌ఆర్‌ఐ జలగం సుధీర్, ప్రకాశం జిల్లాకు చెందిన వెలిగొండ ప్రాజెక్టు సాధన సమితి అధ్యక్షుడు, ఎన్‌ఆర్‌ఐ వడ్డె శ్రీనివాస్‌ మరో ఇద్దరు ఫ్లోరోసిస్‌ బాధితులతో కలసి ఏప్రిల్‌ 22న వారణాసిలో నామినేషన్లు వేయబోతున్నారు.  

నల్లగొండలో 2 లక్షల మంది బాధితులు 
నల్లగొండ జిల్లాలో దాదాపు 2 లక్షల మంది ఫ్లోరోసి స్‌ బాధితుండగా, ప్రకాశం జిల్లాలో వేలాది మంది ఉన్నారు. ఫ్లోరోసిస్‌ వ్యాధి గుర్తింపు, చికిత్స విధానం పై పరిశోధనల కోసం 2007–08లో నాటి యూపీఏ ప్రభుత్వం దేశంలో 2 రీజినల్‌ ఫ్లోరోసిస్‌ మిటిగేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దక్షిణాది రాష్ట్రాల కోసం నల్లగొండ జిల్లాకు, ఉత్తరాది రాష్ట్రాల కోసం గుజరాత్‌కు ఈ కేంద్రాలను మంజూరు చేసింది. 2007లో ఈ ప్రాజె క్టు నల్లగొండ జిల్లాకు మంజూరు కాగా, ఇప్పటి వర కు కాగితాలపైనే ఉండిపోయింది. నాటి రాష్ట్ర ప్రభు త్వ విజ్ఞప్తి మేరకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ సంస్థ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ల ను తయారు చేసి, 2007–12 మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మూడుసార్లు సమర్పించింది.

తరువాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014లో ఈ ప్రాజెక్టు కోసం చౌటుప్పల్‌లో 8 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌కు జిల్లా కలెక్టర్‌ కోర గా, ఇందుకు ఆ సంస్థ నిరాకరించింది. తాము కన్స ల్టెంట్‌గా మాత్రమే సేవలందిస్తామని, ప్రాజెక్టును అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం.. నాయకులు, అధికారుల అనాసక్తితో ఈ ప్రాజెక్టు అటకెక్కింది.

కేంద్రం అశ్రద్ధ... 
డిసెంబర్‌ 2017లో ఎన్‌ఆర్‌ఐల బృందం సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో సమావేశమై ప్రాజెక్టు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టు స్థితిగతులను తెలుపుతూ కేసీఆర్‌ నుంచి కొన్ని రోజులకు ఓ లేఖ అందిందని జల గం సుధీర్‌ తెలిపారు. కేంద్రంలోని కొందరు అధికారులు అశ్రద్ధ చూపడంతో ప్రాజెక్టు సాధించలేకపోతున్నామన్నారు. ఈ విషయంలో కేం ద్రం విఫలం కావడంతోనే ప్రధానిపై పోటీకి దిగుతున్నామన్నారు. ఫ్లోరోసిస్‌ రీసెర్చ్‌ సెంటర్‌తో పాటు వ్యాధి బాధిత ప్రజలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నదే తమ డిమాండ్‌ అని అన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top