మైనారిటీ కాలేజీల ప్రవేశాలకు నోటిఫికేషన్‌ | Notification for minority colleges entrants | Sakshi
Sakshi News home page

మైనారిటీ కాలేజీల ప్రవేశాలకు నోటిఫికేషన్‌

May 6 2018 2:28 AM | Updated on May 6 2018 2:28 AM

Notification for minority colleges entrants - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకులాల విద్యాసంస్థల సొసైటీ(టెమ్రీస్‌) జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. శనివారం హైదరాబాద్‌ హజ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ కార్యదర్శి బి.షఫియుల్లా, అకాడమీ అధిపతి ఎంఏ లతీఫ్‌ అత్హర్‌ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పన్నెండు జూనియర్‌ కళాశాలల్లో 2018–19 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎస్సెస్సీలో వచ్చిన మార్కుల గ్రేడ్‌ల ఆధారంగా ఈ నెల 16 నుంచి 20 వరకు విద్యార్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను 21న విడుదల చేస్తామని, 22 నుంచి 25 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. గురుకుల కళాశాలలు జూన్‌ ఒకటి నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.  

మైనారిటీలకు 75 శాతం సీట్లు 
మైనారిటీ గురుకుల కళాశాలల్లో 75 శాతం సీట్లు మైనారిటీ వర్గాలు, 25 శాతం సీట్లను మైనారిటీయేతరులతో భర్తీ చేస్తున్నట్లు షఫియుల్లా, లతీఫ్‌ అత్హర్‌లు వెల్లడించారు. కుటుంబ వార్షికాదాయం పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల వరకు గల విద్యార్థులు గురుకుల ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. 12 గురుకుల కళాశాలల్లో 960 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

పదకొండు గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు, నిజామాబాద్‌లో మాత్రం సీఈసీ, ఎంఈసీ విభాగాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఎంపీసీలో 440, బైపీసీలో 440, సీఈసీలో 40, ఎంఈసీలో 40 సీట్లు ఉన్నాయని చెప్పారు. కళాశాలల్లో అదనంగా ఫౌండేషన్‌ కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు, ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాల్లో రోబోటిక్‌ ల్యాబ్‌ను ప్రారంభించామని, శిక్షణ కోసం ఇప్పటికే సింగపూర్‌లోని ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నామని వివరించారు. త్వరలో ప్రత్యేక క్రీడాపాఠశాల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement