‘సినిమా’ బంద్‌

No TVs in super luxury buses - Sakshi

సూపర్‌ లగ్జరీ బస్సుల్లో కానరాని టీవీలు

నిర్వహణను అటకెక్కించిన వైనం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్టీసీలో ప్రయాణికులకు వినోదం కరువైంది. రాష్ట్రంలోని పలు సుదూరప్రాంతాలకు ప్రయాణించేందుకు గతంలో సూపర్‌లగ్జరీ బస్సులను ప్రవేశపెట్టింది ఆర్టీసీ. దూర మార్గాలు కావడంతో ప్రయాణికులకు అలసట తెలియకుండా పుష్‌ బ్యాక్‌ సీట్లతోపాటు వినోదం అందించేందుకు టీవీలు ఏర్పాటు చేసింది.

వీటిలో వివిధ సినిమాలు వేసేవాళ్లు. సినిమాలతోపాటు పలు ప్రకటనలూ వచ్చేవి. గత కొంతకాలంగా వీటి నిర్వహణ సరిగా ఉండటం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. నిర్వహణపేరుతో అన్ని సూపర్‌ లగ్జరీ బస్సుల్లో టీవీల కనెక్షన్‌ పీకి పారేసారు. కొత్తగా వచ్చిన బస్సుల్లో టీవీల స్థానంలో ఖాళీ అరలు దర్శనమిస్తున్నాయి. కొన్నింటిలో టీవీలు ఉన్నా.. ఎలాంటి ప్రయోజనం లేక ఉత్సవిగ్రహాలుగా మారాయి.  

మౌనమే సమాధానం..
 రాష్ట్ర ఆర్టీసీలో మొత్తం 1748 సూపర్‌ లగ్జరీ బస్సులు ఉన్నాయి. దాదాపు అన్ని బస్సుల్లోనూ ఇదే దయనీయ పరిస్థితి నెలకొంది. దీంతో రాజధాని నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రధాన నగరాలకు , పొరుగురాష్ట్రాలకు ఈ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు వినోదం అందడం లేదు. టీవీలు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించిన ప్రయాణికులకు .. డ్రైవర్ల నుంచి మౌనమే సమాధానంగా వస్తోంది. ఇంతకాలంగా టీవీలు నిద్రపోతున్నా.. ఆర్టీసీ తమ వెబ్‌సైట్లలో మాత్రం వీటిని వీడియో కోచ్‌లనే ప్రచారం చేసుకోవడం గమనార్హం.

నిర్వహణ సమస్య...
సూపర్‌ లగ్జరీ బస్సుల్లో టీవీలున్నా నిర్వహణ సమస్యలు తలెత్తడంతోనే కొన్ని నెలలుగా వీటిని పక్కనబెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. బస్సు డ్రై వర్లే వీటిని నియంత్రించాల్సి రావడం, టీవీల్లో తరచుగా రిపేర్ల సమస్యలు తలెత్తడంతో మొత్తానికి వాటిని అటకెక్కించారు.

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో టీవీలను నియంత్రణ, నిర్వహణలకు ప్రత్యేకంగా మనుషులు ఉంటారు. ఆర్టీసీలో అలాంటి అవకాశం లేదని, అదీ ఒక కారణంగా చెబుతున్నారు. కానీ, ఏపీకి చెందిన బస్సుల్లో టీవీల నియంత్రణకు ఎలాంటి అదనపు సిబ్బంది లేకపోయినా బాగానే పనిచేస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఆ బస్సులను ఎక్కేందుకే ఆసక్తి చేపిస్తున్నారు.  

త్వరలోనే ఏర్పాటు చేస్తాం
ఒక్కో టీవీ ధర దాదాపుగా రూ.20,000లకు అటుఇటూగా ఉంది. ఇంతటి ఖరీదైన టీవీల నిర్వహణ సవాలుతో కూడినది. పైగా కొన్ని టీవీలు పదే పదే రిపేర్లు వస్తున్నాయి. అందుకే, కొత్త బస్సుల్లోనూ టీవీలు పెట్టించలేదు. బస్సుల్లో ప్రేక్షకుల ఇబ్బంది మా దృష్టికి వచ్చింది. త్వరలోనే ప్రయాణికులకు తిరిగి టీవీలు అందించే ఏర్పాటు చేస్తాం. – వెంకటేశ్వర్లు ఆర్టీసీ ఈడీ (రెవెన్యూ)    సెక్రటరీ కార్పొరేషన్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top