వరంగల్‌లో వెటర్నరీ కాలేజీ ఏర్పాటు చేయాలని పశుసంవర్థకశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు.
హైదరాబాద్ : వరంగల్‌లో వెటర్నరీ కాలేజీ ఏర్పాటు చేయాలని పశుసంవర్థకశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. కాలేజీ ఏర్పాటుకు ముందు వెటర్నరీ కాలేజీ ఆఫ్ ఇండియా (వీసీఐ) అనుమతి అవసరం. అందుకోసం వీసీఐకి లేఖ రాసినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా 'సాక్షి'కి చెప్పారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచే వెటర్నరీ కాలేజీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
దాదాపు 30 వెటర్నరీ సీట్లు వరంగల్‌కు వచ్చే అవకాశం ఉంది. కాగా ఫిషరీస్ సైన్స్ కాలేజీ ఏర్పాటుపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కాలేజీని మహబూబ్‌నగర్ జిల్లా జూరాల సమీపంలో ఏర్పాటు చేయాలా? ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేయాలా? అన్నది తేలలేదు. మహబూబ్‌నగర్ జిల్లాకు ఇప్పటికే మెడికల్ కాలేజీ మంజూరు చేసినందున ఖమ్మం జిల్లాకే ఫిషరీస్ సైన్స్ కాలేజీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.