త్వరలో అమల్లోకి నూతన అటవీ చట్టం! 

New forest law soon to be implemented - Sakshi

‘1967 చట్టం’ స్థానంలో కొత్త చట్టానికి కసరత్తు పూర్తి

‘అటవీ’ నేరాలు, వేటకు పాల్పడితే శిక్షలు మరింత కఠినం

నేరాలకు ప్రేరేపించేవారు, ప్రోత్సహించే వారు శిక్షార్హులే

ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు

పరిశీలన తర్వాత మార్పులు చేర్పులతో అసెంబ్లీ ఆమోదానికి..  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు త్వరలోనే నూతన అటవీ చట్టం అమల్లోకి రాబోతోంది. అడవుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో గతంలోని నిబంధనలకు భిన్నంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ కొత్త చట్టంలో భాగంగా అడవుల్లో చెట్ల నరికివేతతో పాటు పులులు, ఇతర జంతువుల వేటకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టానికి ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి.

అడవుల్లో ఆక్రమణలు, అక్రమ కలప రవాణా, అరుదైన వన్యప్రాణుల వేటకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా రాష్ట్ర అటవీశాఖ పలు ప్రతిపాదనలు రూపొందించింది. చట్టాన్ని మరింత కఠినతరం చేయడం, గణనీయంగా జైలు శిక్షలు, జరిమానాలు పెంచడం ద్వారా ఈ నేరాలకు పాల్పడే వారిలో భయం పుట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు పదేపదే అటవీనేరాలకు పాల్పడేవారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇప్పటివరకున్న చట్టాల మేరకు ఈ తరహా నేరాలకు ప్రేరేపించేవారు, ప్రోత్సహించేవారు, డబ్బు సమకూర్చేవారి జోలికి వెళ్లకపోవడంతో నూతన చట్టంలో వీరి భరతం కూడా పట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.  

రెండ్రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు 
ప్రస్తుతం అనుసరిస్తున్న అటవీచట్టం 1967లో రూపొందించినది కావడంతో మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్త అంశాలు చేర్చాలని మొదట భావించారు. అయితే దేశానికే ఆదర్శంగా తెలంగాణ అటవీచట్టం ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో కొన్ని కీలకమార్పులతో నూతన చట్టానికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేశారు. వీటిని ఒకటి, రెండ్రోజుల్లో అటవీశాఖ ప్రభుత్వానికి పంపించనుంది. దీనిపై ప్రభుత్వ పరంగా పరిశీలనతో పాటు న్యాయశాఖ సూచించే మార్పులు చేర్పులకు అనుగుణంగా తీర్చిదిద్ది అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదం లభించగానే దీని అనుమతి కోసం కేంద్రప్రభుత్వానికి పంపుతారు.

అటవీ నేరాలకు కనీస శిక్ష మూడేళ్లు 
అడవుల్లో చెట్ల నరికివేత, జంతువుల వే ట, అటవీ భూ ఆక్రమణలు వంటి ఇతర నేరాలకు పాల్పడిన వారిపై కనీసం మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధించేలా అటవీశాఖ ప్రతిపాదించింది. అ లాగే షెడ్యూల్డ్‌ చెట్ల జాబితాలో మరికొన్ని చెట్లను చేర్చనుంది. ఇంతవరకు ఎర్రచందనం, చందనం చెట్లు ఈ జాబితాలో ఉండగా, కొత్తగా టేకు, నల్లమద్ది, బీజాసాల్, నారేటి మొదలైన రకాలను కూడా జాబితాలో చేర్చనున్నారు. అరుదైన చెట్లను నరికేవారు, అక్రమ రవాణా చేసే వారితో సహా దీనిని ప్రోత్సహించే వారికి కూడా శిక్ష పడేలా నూతన చట్టంలో ప్రతిపాదించినట్టు సమాచారం.

పదేపదే అటవీనేరాలకు పాల్పడేవారి పట్ల కూడా మరింత కఠినంగా వ్యవహరించేలా ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. ఇటు వన్యప్రాణుల సంరక్షణ, అరుదైన జంతుజాతుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపైనా అటవీశాఖ దృష్టి సారించింది. పులుల అభయారణ్యాల్లో డ్రోన్‌ కెమెరాల ద్వారా వాటి జాడను, వేటగాళ్ల కదలికలను పసిగట్టాలని భావిస్తోంది. పులులు, ఇతర జంతువులు అక్రమ కరెంట్‌ తీగల బారిన పడి మరణించకుండా ఇన్సులేటెడ్‌ వైరింగ్, మెటల్‌ డిటెక్టర్ల వినియోగం, ఇతర చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top