80 సీట్లు.. 8113 దరఖాస్తులు  | Sakshi
Sakshi News home page

80 సీట్లు.. 8113 దరఖాస్తులు 

Published Thu, Jan 24 2019 8:52 AM

Navodaya vidyalaya Online Admission Adilabad - Sakshi

కాగజ్‌నగర్‌: ఉమ్మడి జిల్లాలోని కాగజ్‌నగర్‌ పట్టణంలో గల జవహర్‌ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి తీవ్ర పోటీ నెలకొంది. జాతీయ విద్యావిధానం అనుసరించి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి ఈసారి గతంలో పోల్చితే కాస్త తక్కువ పోటీ ఉంది. 2019– 20 విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 80 సీట్లు ఉండగా ఏకంగా 8113 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన ఒక్కో సీటుకు 101 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. నవోదయలో ఒక్కసారి సీటు సాధించారంటే చాలు 12వ తరగతి వరకు ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్య, సంస్కృతి, సాంప్రదాయ విలువలు, సాహసోపేత కృత్యాలు, క్రీడలు, పౌష్టికాహారంతోపాటు సమున్నత శిక్షణ లభిస్తాయి. ఈ నేపథ్యంలో సాధారణంగానే పోటీ అధికంగా ఉంటుంది. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థుల ఓఎంఆర్‌ షీట్లను ఢిల్లీకి పంపిస్తారు. అక్కడే సీబీఎస్‌ఈలో విద్యార్థుల ఎంపిక జరుగుతోంది.

గ్రామీణ విద్యార్థులకు ప్రాధాన్యం..
కాగజ్‌నగర్‌ నవోదయ విద్యాలయంలో ఇప్పటి వరకు 25 బ్యాచ్‌లు నిర్వహించారు. ప్రస్తుతం 26వ బ్యాచ్‌ కొనసాగుతుండగా 480 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా నవోదయలో ప్రవేశానికి గ్రామీణ విద్యార్థులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇందులో 75 శాతం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, 25 శాతం   పట్టణ ప్రాంతాల విద్యార్థులకు, 3 శాతం దివ్యాంగులకు రిజర్వు చేశారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, మిగతా ఖాళీలు ఓపెన్‌ కేటగిరిలో ఎంపిక చేస్తారు. బాలికలు 33 శాతం, బాలురు 77 శాతం రిజర్వేషన్‌తో ఎంపిక జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ, నేపాలీగారో భాషలలో పరీక్షలు నిర్వహిస్తుండడం విశేషం.
 
తగ్గిన దరఖాస్తులు.. 
నవోదయలో 6వ తరగతిలో 80 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా 8113 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో సీటుకు 101 మంది పోటీ పడుతున్నా దరఖాస్తులు ఈసారి తక్కువగానే వచ్చాయి. 2018– 19 సంవత్సరానికి 12,421 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి దాదాపు 4వేల దరఖాస్తులు తగ్గాయి. అప్పుడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు స్వీకరించగా ఈసారి కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే స్వీకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఆన్‌లైన్‌ సెంటర్లు లేకపోవడంతో దరఖాస్తులు తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి వచ్చిన 8113 దరఖాస్తుల్లో ఆదిలాబాద్‌ జిల్లా నుంచి 1998, నిర్మల్‌ నుంచి 2046 మంది, మంచిర్యాల నుంచి 2094 మంది, కుమురం భీం జిల్లా నుంచి 1995 దరఖాస్తులు ఉన్నాయి.

ఉమ్మడి జిల్లాలో 32 పరీక్ష కేంద్రాలు..
ప్రవేశ పరీక్ష నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్, ఉట్నూర్‌ బ్లాక్‌లలో 8 కేంద్రాలు, నిర్మల్‌ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, భైంసా బ్లాక్‌లలో 8 పరీక్ష కేంద్రాలు, మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట, చెన్నూర్, మందమర్రి బ్లాక్‌లలో 8 కేంద్రాలు, కుమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్‌(టి) బ్లాక్‌లలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 100 మార్కుల పరీక్షలో 50 ప్రశ్నలు, 50 మార్కులు మెంటల్‌ ఎబిలిటీపై, 25 ప్రశ్నలు, 25 మార్కులు, అర్థమెటిక్‌పై, 25 ప్రశ్నలు, 25 మార్కులు భాషా నైపుణ్యంపై పరీక్ష ఉంటుంది.
 
2న 9వ తరగతికి పరీక్ష.. 
కాగజ్‌నగర్‌ నవోదయలో 9వ తరగతిలో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ కోసం ఫిబ్రవరి 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకు సైతం తీవ్ర పోటీ నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 275 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. 2న విద్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ చక్రపాణి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.
 
ప్రతిభ ఆధారంగానే ఎంపిక
విద్యార్థుల ప్రతిభ ఆధారంగానే నవోదయ విద్యాయంలో ప్రవేశాలకు ఎంపిక జరుగుతోంది. ప్రవేశ పరీక్ష పారదర్శకంగా నిర్వహిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి అపోహలను నమ్మవద్దు. విద్యార్థుల ఎంపిక ఢిల్లీలోని విద్యాలయ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే గతేడాదికంటే ఈసారి దరఖాస్తులు చాలా తగ్గాయి. ఈఏడాది కేవలం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేపట్టడంతో వేలల్లో సంఖ్య తగ్గింది. – చక్రపాణి, ప్రిన్సిపల్‌ 

Advertisement

తప్పక చదవండి

Advertisement