ప్రకాశం బ్యారేజ్‌కి పోటెత్తుతున్న వరద

Nagarjuna Sagar And Srisailam Dam Are Rising Flood Waters - Sakshi

సాక్షి, కృష్ణా: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు... తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో జిల్లాలోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కి  వరద నీళ్లు పోటెత్తుతున్నాయి. వరద నీటి ఇన్ ఫ్లో లక్షా ఇరవై రెండువేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో లక్షా నాలుగువేల క్యూసెక్కులుగా ఉండటంతో బ్యారేజ్‌లోని డెబ్భై గేట్లను అధికారులు ఒక్క అడుగుమేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు. బుధవారం ఉదయానికి సుమారు నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు బ్యారేజ్‌లోకి  రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎగువ, దిగువ నది పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అధికారలను ఆదేశించారు. సమారు నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఎగువప్రాంతంలో ఉన్న రావిరాళ, వేదాద్రి గ్రామాలతో పాటు పలు గ్రామాలు ముంపు గురై  రాకపోకపోకలు స్తంభించనున్నాయి. అయితే రావిరాళ, వేదాద్రి గ్రామాలను ఖాళీ చేయించి పునరావాసాలకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 

అదేవిధంగా ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్‌కు వరద నీటి ఉధృతి పెరగడంతో 24 క్ర‌ష్ట్‌ గేట్లు ఎత్తి, సుమారు పది అడుగుల వరకు నీటిని మంగళవారం అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్‌కు ఇన్‌ ఫ్లో 4,13,239 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,13,239  క్యూసెక్కులు సమానంగా ఉన్నాయి. సాగర్‌ జలాశయ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.80 అడుగులు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీ లు కాగా ప్రస్తుతం 311.14 టీఎంసీలుగా నమోదైంది.

కర్నూలు జిల్లా శ్రీశైలంలో గరిష్ట స్థాయి కి చేరుకున్న నీరు క్ర‌ష్ట్‌ గేట్ల‌పై నుంచి ప్ర‌వ‌హిస్తున్న‌ది. దీంతో స్థానికులు, అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. డ్యామ్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం డ్యామ్‌లో నీటి సామర్థ్యం 884.8 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైల జలాశయం నుంచి 6 గేట్లు తెరచి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు అధికారులు నీటిని విడుదల చేశారు. ఇన్‌ ఫ్లో 3,33,157 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,23,373 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 215.8450 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top