తల్లిపాలకు దూరం..దూరం..!

Mother Milk Celebrations Special Story - Sakshi

ముర్రుపాలకు నోచుకోని శిశువులు

పాలు ఇవ్వని తల్లులకు రొమ్ము కేన్సర్‌ ముప్పు

చిన్న వయసులోనే ఇన్‌ఫెక్షన్ల భారినపడుతున్న శిశువులు

ఆగస్టు ఏడు వరకు తల్లిపాల వారోత్సవాలు

సాక్షి, సిటీబ్యూరో: అమ్మపాల స్థానాన్ని ‘అమ్మకపు’ పాలు ఆక్రమించేశాయి. ఆధునిక జీవన శైలి, పని ఒత్తిడి తల్లీ పిల్లల అనుబంధాన్ని శాసిస్తున్నాయి. సకల సౌకర్యాలతో తులతూగుతున్న నవతరం శిశువులు అమ్మ మురిపాలకు, చనుబాలకు నోచుకోలేక పోతున్నారు. చాలా మంది పోతపాలే ఆహారంగా పెరుగుతున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమిత మైన ఈ విషసంస్కృతి నేడు పల్లెలకు సైతం పాకింది. బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన  అన్ని రకాల పోషకాహారాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్‌లు, క్యాల్షియం, ఐరెన్‌ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇదిలా ఉంటే ఎన్‌ఎఫ్‌హెచ్‌ సర్వే ప్రకారం రాష్ట్రంలో 22 శాతం మంది చిన్నారులు మాత్రమే పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగుతుండగా, 30 శాతం మంది అసలు తల్లిపాల రుచే ఎరుగడం లేదు. దీంతో అనేక మంది చిన్నారులు వైరల్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నారు. 

ఏటా వెయ్యి కోట్లపైనే వ్యాపారం
నాగరికతపై ఉన్న మోజు...అందం చెడిపోతుందనే అపోహ.. ఉద్యోగం... సంపాదన..పనిఒత్తిడి... మారిన జీవనశైలి.. తదితర కారణాల వల్ల ఆధునిక తల్లులు డబ్బాపాలను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో ఏడాదికి దాదాపు 1.5లక్షల మంది శిశువులు జన్మిస్తుండగా, వీరిలో 75 శాతం మందికి డబ్బా పాలే దిక్కవడంతో పాల పౌడర్, సీసాల ధరలు భారీగా పెరిగాయి.  బహిరంగ మార్కెల్లో  ఒక్కో పాల సీసా ధర రూ.90 నుంచి రూ. 200 పలుకుతుండగా, పాలపౌడర్‌ ధర కూడా రూ.130 నుంచి రూ.180 పలుకుతోంది. పోతపాల వల్ల తల్లికి బిడ్డపై, బిడ్డకు తల్లిపై ఉండాల్సిన ప్రేమ తగ్గుతోంది. వయసు వచ్చాక ఇరువురి మధ్య దూరం పెరుగడంతో పాటు చాలా మంది తల్లులు రొమ్ము, అండాశయ క్యాన్సర్‌కు గురవుతున్నారు.   

బిడ్డకు తల్లిపాలే శ్రేష్ఠం
అప్పుడే పుట్టిన పిల్లలకు అందే మొట్టమొదటి ప్రకృతిసిద్ధ ఆహారం తల్లిపాలు. జీవితంలోని తొలి మాసంలో పిల్లలకు అవసరమైన శక్తి, పోషకాలను అందించడమే కాకుండా ఆరు నుంచి పన్నెండు నెలలకు, ఏడాది నుంచి ఏడాదిన్నర వరకూ వారి పోషక అవసరాలను ఎక్కువ వరకూ తల్లిపాలు అందిస్తాయి. స్పర్శ, మానసిక వికాసాన్ని తల్లిపాలు పెంపొందిస్తాయి. పిల్లలకు అంటు, దీర్ఘకాల వ్యాధులు రాకుండా కాపాడతాయి. ప్రత్యేకంగా తల్లిపాలు బాల్యంలో వచ్చే డయేరియా , న్యుమోనియా లాంటి వ్యాధుల బారినుంచి తొందరగా కోలుకునేలా చేసి వారి ఆయుష్షు పెంచుతాయి.  –డాక్టర్‌ అనిత కున్నయ్య, గైనకాలజిస్ట్, సిటిజన్‌ ఆస్పత్రి, నల్లగండ్ల

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top